విద్యార్థులు పట్టుదలతో చదవాలి

విద్యార్థులు పట్టుదలతో చదవాలి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్ర ప్రతినిధి, జనగామ: విద్యార్థులు కష్టపడి చదవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలోని క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని, లక్ష్యసాధనతో విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉండన్నారు. క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు మంచి పేరుందని, ఆ పేరు కళాశాల యాజమాన్యం నిలబెట్టిందన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన అనేక మంది వివిధ రంగాల్లో ఎదిగారన్నారు. నేటి పోటీ ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక విద్య ఎంతో విలువైందన్నారు.

ఆ విలువల్ని నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండన్నారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని పొందుతూనే రాణించి ప్రయోజకులుగా ఎదగాలన్నారు. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ నేటి పోటి ప్రపంచంలో విద్యార్థులు చైతన్యం, ఉత్సాహం, శాస్త్రీయ ఆలోచనతో విద్యను అభ్యసించాలన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు చేయూతను ఇస్తుందన్నారు. స్టూడెంట్లు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, బిషప్ ఉడుముల బాల, కళాశాల డైరెక్టర్ అగస్టీన్ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.