నిరాడంబరతే ఆభరణం

నిరాడంబరతే ఆభరణం
Sudha Murthy Biography

మన చుట్టూ ఎన్నో రకాల సౌకర్యాలు ఉన్నా.. వాటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా.. ఎన్నో రకాల కార్యాలను అలుపెరగకుండా, అలవోకగా చేస్తూ.. సంతోషానికి సంబరపడకుండా, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. అందరికీ సంతోషాన్ని పంచుతూ.. సాయం చేస్తూ ..  ఓ సగటు మనిషిలా జీవిస్తోన్న వారిని స్థితప్రజ్ఞులు అంటారు. అలాంటి కోవకు చెందిన మానవతా మూర్తే పద్మశ్రీ శ్రీమతి సుధా కులకర్ణి మూర్తి.. ఆమె ఆలోచనలు, ఆచరణ విధానం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకు కృషి, పట్టుదల, పారదర్శక జీవన విధానం, అతీంద్రయమైన సంకల్ప బలం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని కారణజన్ములు అంటారు. అటువంటి కోవకు చెందినవారే ఈ ఆదర్శమూర్తి.

సుధామూర్తి ఆగస్టు 19, 1950వ సంవత్సరంలో నేటి కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా, షిగ్గాన్​లో జన్మించారు. చిన్నప్పటి నుండి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఈమె, కుటుంబ అనుబంధాల విలువలను ఆకళింపు చేసుకున్నారు. చిన్నప్పటి నుండే చదువు పట్ల  ఎంతో శ్రద్ధ కనబరుస్తూ, చురుగ్గా ఉంటూ అన్ని తరగతుల్లో మొదటి స్థానంలో నిలిచేవారు. అలా మహిళ అయినా కూడా సాంకేతిక విద్యను అభ్యసించాలని అనుకున్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లకు ఇలాంటి విద్యలా? అనుకోలేదు. తను అనుకున్న విధంగానే సాంకేతిక విద్యను అభ్యసించి, ఆ తరువాత కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్​ చేశారు. అప్పటి ప్రముఖ ఆటో పరిశ్రమైన టెల్కలో సంస్థలో సాంకేతిక నిపుణురాలిగా చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ మన సుధామూర్తిగారే. చేరినప్పుడు ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయినా.. ఇలాంటి చోట ఎక్కువరోజులు ఇమడలేదు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు. తరువాతి కాలంలో తన భర్త ఎన్​.ఆర్​. నారాయణమూర్తిగారితో కలిసి ఇన్ఫోసిస్​ అనే సంస్థను స్థాపించి ఎన్నో వేలమందికి ఉపాధి కల్పించారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు సుధామూర్తి. ఆమె ప్రపంచాన్ని అవలోకనం చేసుకుంది కానీ ప్రపంచం తనను గుర్తించాలని ఎన్నడూ ఆశించలేదు. 

కానీ తన సామాజిక సేవతో సమాజంలో ఆమె మహోన్నత శక్తిగా ఎదిగింది. ఆ శక్తికి ప్రపంచమంతా దాసోహమైంది. రచయితగా, అధ్యాపకురాలిగా, సామాజిక సేవకురాలిగా... ఆమె చేసిన సేవలు అభినందనీయం, ఆచరణీయం. ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ సంస్థ ద్వారా వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించడం, పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, ఆడపిల్లల సౌకర్యాల కోసం పాటుపడటం, భావితరాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో చదువుకునే పిల్లలకు ఎన్నో రకాల పథకాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు ఉచితంగా అందించడం, పేద విద్యార్థులకు కంప్యూటర్​ పరిజ్ఞానాన్ని నేర్పించడం... వంటి ఎన్నో కార్యక్రమాలను చేశారు. ఆడపిల్లలకు శానటరీ నాప్కిన్స్ ను పంచుతూ, వ్యక్తిగత  పరిశుభ్రత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టేవారంటే ఆమె మనస్సు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సమాజానికి మంచి జరుగుతుంది అంటే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సేవల వరకు దేనినైనా అలవోకగా చేసేస్తారు. 

పదిమందికి మేలు జరుగుతుంది అనుకుంటే చాలు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడుగు ముందుకు వేసేస్తారు సుధామూర్తి. ‘మానవ సేవే మాధవసేవ’గా గుర్తెరిగి, ఆచరిస్తూ... మానవత్వాన్ని చాటుకుంటున్న మహోన్నతమూర్తి కాబట్టే ఆమెను ఎన్నో పురస్కారాలు వరించాయి. 2006లో పద్మశ్రీ పురస్కారం, మిలీనియం మహిళా పురస్కారం, ఆర్.కె. నారాయణ్​ సాహిత్య పురస్కారం.. ఇలా ఎన్నో పురస్కారాలు వరించాయి.  2006లో పద్మశ్రీ, 2019లో ఐఐటీ కాన్పూర్​ వారు ఆమెను గౌరవ డాక్టరేట్​తో సత్కరించారు. ఇప్పుడు పద్మభూషణ్​.. ఇంతగా సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నా ఆమె మాత్రం ఒక సాధారణమైన ఇల్లాలు లాగే కనిపిస్తుంది. ఒక మామూలు చీర, మెడలో నల్లపూసలు, మోముపై చెరగని చిరునవ్వు.. ఇవే ఆమె ఆభరణాలు.. ఆమె తన ఆహార్యానికి సంబంధించి ఎటువంటి ఆడంబరాలు పాటించరు. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం..  ఒక సాధారణ మహిళ ఎలా జీవిస్తుందో.. ఆమె కూడా అలాగే జీవిస్తారు. షాపింగ్​లు చేయడం, వేలకు వేలు ఖర్చుపెట్టడం వంటి విషయాలు ఆమెకు అస్సలు తెలియవనే చెప్పాలి. సేవనే పరమావధిగా, స్థితప్రజ్ఞతనే ఆభరణంగా మలచుకున్న మానవత్తం మూర్తీభవించిన సేవామూర్తి సుధామూర్తి. అలాంటి మహోన్నత మూర్తికి వేనవేల వందనాలు.