నిజాలను నిర్భయంగా వెలికి తీయాలి

నిజాలను నిర్భయంగా వెలికి తీయాలి
  • పత్రికలకు పారదర్శకత అవసరం 
  • భవిష్యత్తు అంతా డిజిటల్ రంగానిదే
  • అనతి కాలంలోనే ప్రజాభిమానం చూరగొన్న ముద్ర
  • ముద్ర క్యాలెండర్ ఆవిష్కరణలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మీడియా అనేది నిజాలను నిర్భయంగా వెలికి తీయాలని, మీడియాకు పారదర్శకత అవసరమని, రానున్న భవిష్యత్తు అంతా డిజిటల్ సమాచార యుగానిదే అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో ముద్ర డిజిటల్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పటికీ ప్రజా సమస్యలను వెలికి తీసి తక్షణం సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తూ అనతి కాలంలోనే ముద్ర పాఠకుల, వీక్షకుల అభిమానాన్ని సంపాదించుకుందని ప్రశంసించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కార మార్గాలు సూచించేలా మీడియా ఉండాలని, తద్వారా ప్రజలు కూడా మీడియాకు తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందవచ్చని ఆలోచనతో నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ తమ కష్టాలను మీడియాకు చెప్పి మీడియాలో వచ్చిన అనంతరం పరిష్కారం లభిస్తే ప్రజలు ఆనందిస్తారని చెప్పారు. సమాచార రంగంలో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ తో మీడియా రంగం కూడా సొబగులు సంతరించుకొని కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు.  సమాచార రంగంలో నానాటికి  చోటు చేసుకుంటున్న నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఆయా మీడియా సంస్థలు కూడా మార్పు చెంది ప్రజలకు చేరువ కావాలని, ప్రజా సమస్యలను వెలికి తీయడంలో ముందుండాలని, బాధితుల పక్షాన నిలవాలని కలెక్టర్ వెంకట్రావు ఆకాంక్షించారు. ఈ ముద్ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, కొండ శ్రీనివాసరావు, నజీర్, వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి, జహీర్, వాసా చంద్రశేఖర్, రామచంద్ర రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.