ఏపీ అసెంబ్లీ నుండి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుండి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి ఆదివారం  11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్  చేశారు. వ్యవసాయ మోటార్లకు  విద్యుత్  మీటర్లు  బిగింపుపై  అసెంబ్లీలో  టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళ  పరిస్థితులు నెలకొన్నాయి. దరిమిలా  11 మంది  టీడీపీ ఎమ్మెల్యేలను  అసెంబ్లీ నుండి  స్పీకర్ తమ్మినేని సీతారాం  సస్పెండ్  చేశారు.   వరుసగా  ఆరో రోజున  ఏపీ  అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను  సస్పెండ్  చేశారు.  వ్యవసాయ మోటార్లకు  మీటర్ల బిగింపులో  రూ. 6 వేల కోట్ల కుంభకోణం  జరిగిందని  టీడీపీ సభ్యులు  ఆరోపించారు.  వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల  బిగింపు, విద్యుత్ చార్జీల పెంపు విషయమై  టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే టీడీపీ వాయిదా తీర్మానాన్ని  స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ఈ విషయమై టీడీపీ సభ్యులు  సభలో చర్చకు పట్టుబడ్డారు.  సభా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి  ఆందోళనకు దిగారు.

టీడీపీ సభ్యుల నిరసనల నేపథ్యంలో  సభలో  గందరగోళ  పరిస్థితులు  నెలకొన్నాయి.  టీడీపీ సభ్యులను  తమ స్థానాల్లో  వెళ్లి  కూర్చోవాలని  స్పీకర్ తమ్మినేని సీతారాం  సూచించారు. కానీ  టీడీపీ సభ్యులు  మాత్రం  స్పీకర్ పోడియం వద్ద  నిలబడి  నినాదాలు  చేశారు. దీంతో  సభ నుండి  11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను   సస్పెండ్  చేశారు.  సస్పెన్షన్ కు గురైన  టీడీపీ సభ్యులను సభ నుండి వెళ్లిపోవాలని   స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభమైన  రోజు మినహాయించి  మిగిలిన  అన్ని  రోజుల్లో  కూడా టీడీపీ  సభ్యులు  సభ నుండి  సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు  పయ్యావుల  కేశవ్,  నిమ్మల రామానాయుడులను  సస్పెండ్  చేసిన విషయం తెలిసిందే.