నరుడే నారాయణుడని, మానవసేవయే మాధవసేవ యని చాటిచెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద

నరుడే నారాయణుడని, మానవసేవయే మాధవసేవ యని చాటిచెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద
Swami Vivekananda

మతానికి కొత్త అర్థాన్ని, సేవకు పరమార్థాన్ని నిర్వచించి నరుడే నారాయణుడని, మానవసేవయే మాధవసేవ యని చాటిచెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద దేశ యువతకు సదా స్ఫూర్తిదాతగా నిలువాలని 1985లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్ణయించింది.బలమే జీవనం...బలహీనతే మరణం..నువ్వు దేనినైతే ఆలోచిస్తావో ఆవిధంగానే తయారవుతావు. నిన్ను బలహీనుడిగా భావించుకుంటే చివరకు బలహీనుడివే అవుతావు..శక్తిమంతుడిగా భావించుకుంటే శక్తిమంతుడివే అవుతావు. సమస్త శక్తి నీలోనే ఉంది. దానినే విశ్వసించు, నీవు బలహీనుడవని ఎప్పుడూ తలపోయకు..ధీరుడవై నిలిచి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు...అంటూ సమస్త మానవాళిని భయం వదలి సమాజ సేవకు నడుంకట్టాలన్నారు స్వామి వివేకానంద. ఉక్కునరాలు, ఇనుపకండరాలు, వజ్రతుల్యమైన ధృడసంకల్పం, మొక్కవోని విశ్వాసం గల వందమంది యువకులు చాలు...ఈదేశాన్ని ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపడానికి అంటూ ఎలాంటి యువత నేడు అవసరమో వివరించారు ఆమహనీయుడు.

స్వామి సంక్షిప్త జీవిత చరిత్రకలకత్తాకు చెందిన ప్రసిద్ధ న్యాయవాది విశ్వనాథ దత్తా, ఆయన సతీమణి భువనేశ్వరీదేవి దంపతులకు నలుగురు కుమార్తెలు. ఒక మగబిడ్డ కావాలని భువనేశ్వరీ దేవి శివుణ్ని ప్రార్థించింది. 1863 జవనరి 12తేదీ మకర సంక్రాంతి పర్వదినాన నరేంద్రనాథ్‌ జన్మించారు. ఆ శిశువే అనంతరం స్వామి వివేకానందుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. చిన్నప్పుడు కొంటె పనులు చేసినా, పెంపుడు జంతువులతో ఆటలాడుతూ తల్లి చెప్పే భారత, రామాయణ ఇతిహాసాలను శ్రద్ధగా వినేవాడు.పాఠశాలలో చేరింది మొదలు కళాశాల స్థాయి వరకు ఆ బాలుడిలో అసాధారణ మేధాశక్తి, అద్భుత జ్ఞాపకశక్తిని చూసి సహవిద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపడేవారు. వివిధ క్రీడల్లో ప్రావీణ్యం చూపడంతోపాటు మూఢనమ్మకాలను నమ్మకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించేవాడు. చిన్నప్పటినుంచే ధ్యానంపై దృష్టి నిలిపిన నరేన్‌ త్రాచుపాము సవిూపించినా ధ్యానముద్ర వీడేవాడుకాదు. గదిలో బంధించినా నిరుపేదలను చూసి చలించి ఇంట్లో ఉన్నవన్నీ కిటికీలగుండా దానం చేసేవాడు. దేవుడంటే ఎవరు, ఎలా ఉంటాడో కనుక్కోవాలన్న తపనతో ఎంతమందిని అడిగి చూసినా ఫలితం లేకపోవడంతో దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్లి శ్రీరామకృష్ణ పరమహంసను కలుసుకున్నాడు. కోరుకుంటున్న శిష్యుడు, గురువు దొరికేసరికి రామకృష్ణులవారి సంతోషానికి, శిష్యుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

దైవసాక్షాత్కారం కోసం నిరంతర ధ్యానం చేశారు. పరివ్రాజకునిగా దేశసంచారం చేశారు. ఎన్నో క్షేత్రాలు తిరిగి భారతదేశంపై పూర్తి అవగాహనకు వచ్చారు. పేద ధనిక తేడాలకు కలత చెందేవారు. కన్యాకుమారి చేరుకుని ఆమె దివ్య సమక్షాన్ని అనుభూతి చెందిన స్వామిలో ఆధ్యాత్మికతతోపాటు దేశభక్తి మిళితమైంది. స్వామి ప్రసంగాలకు ముగ్ధులైన మద్రాసు ప్రజలు విరాళాలు సేకరించగా 30 ఏళ్ల వయసులో త్యాగభూమి నుంచి భోగభూమి అయిన అమెరికాకు వెళ్లారు. అక్కడ ఎన్నో కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా 1893 సెప్టెంబర్‌ 11న చికాగోలో ప్రారంభమైన సర్వమత మహాసభలో వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 7వేల మంది శ్రోతలు ఉన్నసభలో స్వామి ప్రవేశించారు. అమెరికా సోదర సోదరీమణులారా నామతం గొప్పదంటే..కాదు కాదు నామతం గొప్పది అంటూ కొట్లాడుకుంటున్న కాలంలో కాషాయం కట్టిన ఓ సాధారణ సన్యాసిగా చికాగోలోని సర్వమత సమ్మేళనంలోకి అడుగుపెట్టి ఓ నా అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ఆత్మీయ సంబోధనతో ప్రపంచదేశాలకు భారతీయ సోదరభావాన్ని, ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఆయన ఆత్మీయ సంబోధన విని వేలాదిమంది లేచి రెండు నిమిషాలపాటు చప్పట్లతో ఆనందానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన అనర్గళంగా చేసిన విశ్వజనీన ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. అంతవరకు ఎవరికీ తెలియని స్వామి అసాధారణ ధార్మిక ప్రబోధకుడిగా కీర్తిగాంచారు. చికాగో వీధుల్లో వెలసిన ఆయన చిత్రపటాలకు వందనం చేయనివారు లేరంటే అతిశయోక్తికాదు. డిసెంబర్‌ 16న ఆయన మాతృభూమికి ప్రయాణమవుతుండగా ఆయనను వీడలేకనే అఖండ జనం ఆయనకు వీడ్కోలు పలికారు. మాతృదేశంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.అనంతరం 1899 జూన్‌ 20న కూడా మరోమారు పాశ్చాత్య దేశాలలో పర్యటనకు వెళ్లివచ్చారు. తన నలభయ్యవ పుట్టిన రోజును చూడబోనని స్వావిూజీ సూచించినట్లుగానే 1902 జూలై 4వ తేదీన రాత్రి 9:10గంటలకు స్వావిూజీ మహాసమాధి పొందారు.