సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట-టీఎస్ ఆర్టీసీ జాక్ 

సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట-టీఎస్ ఆర్టీసీ జాక్ 

ముద్ర, తెలంగాణబ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరష్కారానికి ఆందోళనబాట పట్టనున్నట్లు టీఎస్ ఆర్టీసీ జాక్  ప్రకటించింది. సంస్థలోని కార్మికుల సమస్యలను పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ  బుధవారం హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లుకు  టీఎస్ ఆర్టీసీ జాక్ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా జాక్ నాయకులు ఎంఎ మజీద్, జె. ఆర్. రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ గురించి కానీ, కార్మికుల కుటుంబాల గురించి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సంస్థ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతుందన్నారు. కార్మికులపై విపరీతమైన పనిభారం పెరిగి వారి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేసి గుర్తింపు పొందిన సంఘం ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేశారు. సర్వీస్ లో ఉండి చనిపోయిన  కుటుంబాలకు, అలాగే మెడికల్ ఫిట్ నెస్ అయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం వాడుకున్న రూ. 3700 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా టూరిస్టు పర్మిట్ గైడ్ లైన్స్ లో విద్యుత్ బస్సులకు ఫీజు లేకుండా పర్మిట్ ఇచ్చే నిబంధనలను రద్దు చేయాలన్నారు. హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టరును కలిసిన వారిలో  ఆర్టీసీ జాక్  ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, జాక్ లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ), బహుజన కార్మిక యూనియన్ నేతలు ఉన్నారు.