నేరాల నియంత్రణలో సాంకేతికత ఆవశ్యం

నేరాల నియంత్రణలో సాంకేతికత ఆవశ్యం
  • ప్రజా సహకారంతోనే నేరాల అదుపు
  • రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నిర్మల్ :నేరాల నియంత్రణలో సాంకేతికత అత్యంత కీలకమని,నిర్మల్ పట్టణంలో అధునాతన సాంకేతిక నైపుణ్యం దిశగా పోలీస్ శాఖ కృషి చేయటం అభినందనీయమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ఆదివారం నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కేసుల చేధనలో, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని, పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్  దోహదపడుతుందని అల్లోల  అన్నారు. సీసీ కెమెరా ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యంతో పోలీస్ శాఖ పనిచేయడం హర్షణీయమన్నారు. 
 ఎస్పీ  ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మరింత పటిష్టంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు సిసి కెమెరాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో చోరీలు జరగకుండా నిత్యం గాలింపు చర్యలు చేపడుతున్నారని ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.  అపరిచిత వ్యక్తులు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. కాలనీల్లో, వ్యాపార సముదాయ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బిఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, టౌన్ సీ.ఐ మల్లేష్, రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఆర్ఐ రమేష్, యం.టి.ఓ వినోద్, రూరల్, పట్టణ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.