అసలేం జరిగింది..? జన్వాడ విందుపై సర్వత్రా ఆసక్తి
- విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ
- రాజ్ పాకాల ఇచ్చింది రేవ్ పార్టీనా..? దీపావళి విందా..?
- సమాచారం లీకు చేసి పోలీసుల తొందరపాటు
- వీడియో ఫుటేజీలు బయటపట్టేందుకు జంకు
- విందుపై దర్యాప్తు ముమ్మరం
- రాజ్ పాకాలకు నోటీసులు, విచారణకు రాకుంటే అరెస్ట్ చేస్తామని స్పష్టీకరణ
- హైకోర్టును ఆశ్రయించిన రాజ్
- రాజ్ పాకాలకు రెండు రోజుల గడువు ఇవ్వాలంటూ పోలీసులకు హై కోర్టు ఆదేశం
- విజయ్ మద్దూరిని మరోసారి ప్రశ్నించిన పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 26 రాత్రి నగర శివారులోని జన్వాడ ఫాం హౌస్ లో అసలేం జరిగింది.? పోలీసులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టు అందులో జరిగింది రేవ్ పార్టీనా..? లేక బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు దీపావళి విందా..? అందులో హై ప్రొఫైల్ కుటుంబ సభ్యులేనా..? బయటివ్యక్తులెవరైనా ఉన్నారా..? బీఆర్ఎస్ యువనేత సైతం పార్టీలో ఉన్నట్టు అధికార పార్టీ చేస్తోన్నఆరోపణల్లో వాస్తవమెంతా..? అసలా విందులో కేటీఆర్ ఉన్నారా..? లేరా..? ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు పోలీసులు చేసిన దాడి బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగమేనా..? బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు ఈ విందుకు సంబంధించి సేకరించిన సీసీ ఫుటేజీలు, వీడియోలను పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు.? రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ విందు వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుంది..? దీనిపై విచారణ చేపడుతోన్న పోలీసులు ఏం నిగ్గు తేలుస్తారు.? ఇప్పుడిదే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విందు వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి కీలక మలుపులు తీసుకుంటుంటోననే ఆసక్తి నెలకొన్నది. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి.
ఎక్సైజ్ పోలీసులు ఏ1గా ఫామ్ హౌజ్ సూపర్ వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు. మరో కేసులో మోకిలా పోలీసులు ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిలను చేర్చారు. ఇప్పటికే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నారు.మరింత దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లోని రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేశ్ పాకాల నివాసంలో తనిఖీలు కూడా చేపట్టారు. మరోవైపు పార్టీకి సంబంధించి రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేసిన మోకిలా పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఫాంహౌస్ పార్టీకి సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అడ్రస్ ప్రూఫ్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మోకిలా పీఎస్‌కు హాజరుకాకుంటే బీఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని నోటీసులో వెల్లడించారు. రాజ్ పాకాల పరారీలో ఉండడంతో ఆయన ఇంటి గోడకి నోటీసును అతికించారు. ఇదిలా ఉండగా.. రాజ్ పాకాల సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనని అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు.
ఇరకాటంలో సర్కార్...!
ఫాంహౌస్ పై దాడి చేసి 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ జరిగింది రేవ్ పార్టీ అంటూ లీకులు ఇవ్వడం పోలీసులతో పాటు ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పడేసింది. అయితే అక్కడ జరిగింది దీపావళి విందు అని.. అందులో పాల్గొన్నది హై ప్రొఫైల్ కుటుంబ సభ్యులేనంటూ బీఆర్ఎస్, ఆ ఫాం హౌస్ యజమాని రాజ్ పాకాల వ్యాఖ్యలు తాజా పరిస్థితులను బట్టి స్పష్టమవుతున్నది. ఒకవేళ అక్కడ రేవ్ పార్టీ జరిగితే..అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఉంటే దానికి సంబంధించిన సిసి ఫోటేజీలు, వీడియోలు బయటపట్టేందుకు పోలీసులు ఎందకు జంకుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదీలావుంటే వీడియోలు బయటపెడితే పోలీసులు ఆడిన నాటకం బట్టబయలు అవుతుందనే భయంతోనే ఖాకీలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
కొకైన్ పై ఆరా...!
జన్వాడ ఫామ్‌హౌజ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న రాజ్ పాకాల స్నేహితుడు, కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి సోమవారం కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఫామ్‌హౌజ్‌లో గేమ్ ఆడినట్లు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఫామ్‌హౌజ్‌లో పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 26న అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడున్న సెల్ ఫోన్ ను ఓ మహిళ దాచి పెట్టగా విజయ్ మద్దూరి ఆదివారం పోలీసులకు అప్పగించారు.
కాగా అందులో ఉన్న డాటా అధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొకైన్ మత్తుపదార్ధాలు తీసుకొచ్చి విజయ్ మద్దూరికి ఎవరు ఇచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదీలావుంటే. ఈ నెల 27న విజయ్ మద్దూరిని విచారించిన పోలీసులు తనకు రాజ్ పాకాలే కొకైన్ ఇచ్చాడంటూ తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ అదే రోజు రాత్రి విచారణ అనంతరం ఓ వీడియో విడుదల చేసిన విజయ్ మద్దూరి తాను అలాంటి విషయమేమి పోలీసులకు చెప్పలేదనీ, అసలు తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు సోమవారం ఆయన్ను మళ్లీ విచారించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారాన్ని పోలీసులతో పాటు విజయ్ మద్దూరి గోప్యంగా ఉంచడం గమనార్హం.
విచారణకు గడువు ఇవ్వండి : హైకోర్టు
ఫాం హౌస్ లో జరిగిన విందుపై రాజ్ పాకాలకు విచారణ ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. విచారణలో భాగంగా రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఓరియన్ విల్లాస్ లోని ఆయన 40వ నెంబర్ విల్లాకు నోటీసులు అంటించడంతో తనను అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ్ పాకాల సోమవారం హై కోర్టును లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ దీనిపై విచారించింది. పిటీషనర్ తరుపు న్యాయవాడి మయూర్ రెడ్డి రాజ్ పాకాల తన నివాసంలో విందు చేసుకుంటే పోలీసులు అక్రమంగా దాడి చేశారనీ, అందులో రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే రాజ్ ను నిందితుడిగా చేర్చారని కోర్టుకు వివరించారు. రాజ్ పాకాల ప్రతిపక్ష నేత కేటీఆర్ కు బావ మరిది కావడంతో రాజకీయ కక్షతోనే అక్రమ కేసు బనాయించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం తరుపు న్యాయవాది ఏఏజి ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు పార్టీలో అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు విజయ్ మద్దురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41ఏ నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు నివేదించారు.