నేడే జాబ్ క్యాలెండర్
- అసెంబ్లీలో విడుదల చేయనున్న సర్కార్
- ధరణి స్థానంలో ఇక ‘భూమాత’
- క్రీడాకారులకు ఇళ్ల స్థలాలు.. ఉద్యోగాలు
- కొత్త రేషన్ కార్డులు, జీహెచ్ఎంసీ విలీనంపై కేబినెట్ సబ్ కమిటీలు
- రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నేడు అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేరళలో వయనాడ్‌లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయిన విషాదంపై రాష్ట్ర కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసినట్లు వివరించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
అర్హులందరికీ రేషన్, హెల్త్ కార్డులు..
రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌తో హెల్త్ కార్డులను జారీ చేయాలని మంత్రులు చర్చించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయీస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. కాగా త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు.
ఈషా సింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌కు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు
క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, నిఖత్ జరీన్‌కు, సిరాజ్‌కు గ్రూప్ –1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. వీటితో పాటు గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఎమ్మెల్సీల నియామకంపై చర్చ..
ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కెబినెట్లో చర్చించామనీ.. తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. చెరుకు రైతుల ప్రధాన డిమాండ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి.. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
అవసరమైతే ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలనపై చర్చలు జరిపామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.