బీఆర్ఎస్, బీజేపీల మాటలు నమ్మొద్దు

బీఆర్ఎస్, బీజేపీల మాటలు నమ్మొద్దు

సోనియమ్మ వల్లే ప్రత్యేక తెలంగాణ
ఇక్కడ అధికారంలోకి రావటం ఖాయం
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

ఖానాపూర్, ముద్ర : ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్, మళ్ళీ మాయ మాటలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర పాలన కేవలం కాంగ్రెస్​తోనే సాధ్యమని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ ప్రాంతంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో సుస్థిర పాలన ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేసారని, వారి కుటుంబం మాత్రం ధనవంతులయ్యారని విమర్శించారు. గత 9ఏళ్లుగా రాష్టంలో అభివృద్ధి జరగలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వని బీఆర్​ఎస్​, మళ్ళీ దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారని, తాము అధికారంలోకి రాకముందే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రజలు నేటికీ ఇందిరమ్మ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి మాత్రమే నేడు కనిపిస్తోందని చెప్పారు.

కర్ణాటకలో  ఇచ్చిన హామీలను అక్కడ వెంటనే అమలు చేశామన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలను కూడా తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రత్యేక తెలంగాణ రాష్టం ఇచ్చింది సోనియమ్మ అని గుర్తు చేశారు. రైతులను, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.   కాంగ్రెస్ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న ఆయా పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. తాము రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ అభ్యర్థి గెలువలేదని, ఇప్పటికైనా ఆదివాసీ బిడ్డ వెడ్మ బొజ్జును ఆశీర్వదించాస్తే ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ మండలంలోని సదర్మాట్ బ్యారేజీ మంజూరు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కానీ సదర్మాట్ కు ప్రత్యేక కాలువను కట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రస్తుతం పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నమ్మక ద్రోహం చేసే పార్టీలను దూరంగా ఉంచాలని ప్రజలను ఆమె కోరారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ థాక్రే, ఖానాపూర్, నిర్మల్ అభ్యర్థులు వెడ్మ బొజ్జు, శ్రీహరి రావ్, నాయకులు మజీద్, అలెగ్జాందర్, షబ్బీర్ పాషా, రాజుర సత్యం, సలీమ్ ఖాన్, జహీర్, దయానంద్, నిమ్మల రమేష్, తోట సత్యం తదితరులు పాల్గొన్నారు.