లోకసభ ఎన్నికలకు సర్వం సిద్ధం 

లోకసభ ఎన్నికలకు సర్వం సిద్ధం 
  • పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలిన సిబ్బంది 
  • డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది తరలి వెళ్లారు. జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో అధికార యంత్రాంగం సోమవారం నాటి పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుండి పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్ళారు. జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవ ర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.

ఓటింగ్ యంత్రాలు, సిబ్బందిని తరలించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు. అందులో సెక్టార్ అధికారులకు 80 కార్లు, పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు, 139 మినీ బస్సులు, 22 ఇతర వాహనాలున్నాయి. పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటేనర్లను సిద్ధంగా ఉంచారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో 1104 మంది పోలింగ్ అధికారులు, 1104 సహాయ పోలింగ్ అధికారులు, 2208 మంది ఇతర సిబ్బంది, 116 మంది మైక్రో అజ్జర్వర్లు పాల్గొంటున్నారు. నియోజకవర్గాల వారీగా కోరుట్లలో 1261, జగిత్యాలలో 1227, ధర్మపురి 1014, చొప్పదండి పంపిణీ నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 517 మంది, వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో 431 మంది అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ధర్మపురి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జగిత్యాల కేంద్రంలో ఆర్డీవో పి. మధుసూదన్, కోరుట్ల నియోజకవర్గంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జగిత్యాల పంపిణీ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది కలిసి తరలివెళ్లే వాహనాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.