బదిలీ చేయండి సార్.. ఉపాధ్యాయ దంపతుల వేడుకోలు

బదిలీ చేయండి సార్.. ఉపాధ్యాయ దంపతుల వేడుకోలు
Telangana teachers
  •  యేడాదిగా 13 జిల్లాలలో నిలిచిన ప్రక్రియ
  • డీఎస్ఈ ముందు కుటుంబాలతో మౌనదీక్ష
  • వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
  • పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత
  •  సీఎం కేసీఆర్ కలగజేసుకోవాలని వినతి

 ముద్ర, తెలంగాణ బ్యూరో: స్పౌస్ బదిలీలు చేపట్టాలనే డిమాండ్ తో ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నిరసనలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబాల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ధర్నాకు వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను సైతం పోలీస్ వ్యాన్లు ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ముందే స్పౌస్ టీచర్ల బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ లో ఉన్న 13 జిల్లాలపై నిషేధం ఎత్తేసి తక్షణమే ట్రాన్స్ ఫర్లు నిర్వహించాలని కోరుతున్నారు. డీఎస్ఈ ముట్టడి కార్యక్రమానికి చాలా మంది టీచర్లు చిన్నారులతో హాజరయ్యారు. భర్త ఒక జిల్లాలో తాము ఒక జిల్లాలో పనిచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పిల్లల బాగోగులు సరిగా చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేయకండని కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి వెంట వచ్చిన ఓ చిన్నారి ‘కేసీఆర్ తాతా మా అమ్మానాన్నలను ఒకే జిల్లాకు పంపండంటూ’ చేతులు జోడించి ఏడుస్తూ వేడుకున్న తీరు అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

 

యేడాది కాలంగా

 యేడాది కాలంగా 13 జిల్లాలలో ఉపాధ్యాయ దంపతులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతకీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారంతా కలిసి  డీఎస్ఈ కార్యాలయం ముందు శనివారం మౌన దీక్షకు దిగారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు మౌనంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

615 మందికే అనుమతి?

ఉపాధ్యాయ దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాలలో 2,100 మంది బాధితులు ఉన్నారు. అందులో 615 మందికి మాత్రమే స్పౌస్ బదిలీలు జరుగుతున్నాయని అంటున్నారు. అది కూడా కేవలం కొద్ది మంది స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారని, ఎస్జీటీ, పండిట్, పీఈటీ ఇతర ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగడం లేదని విస్తృత ప్రచారం జరుగుతున్నది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి సరైన సమాధానం దొరకక ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు.

 

 కొంతమందికే చేయడం అన్యాయం..

బ్లాక్ లో ఉంచిన 13 జిల్లాలలో 1,656 మంది దంపతుల బదిలీలకు ఫైలు సిద్ధమైందని సమాచారం ఉన్నప్పటికీ, 615 మందికి మాత్రమే బదిలీ చేయాలనుకోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వేదన పడుతున్నారు. 30 శాతం మందికే బదిలీలు చేపట్టి,  పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌస్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోతున్నారు.

 

అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా

సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌస్ కేటగిరీలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేటలో 28 మంది ఎస్జీటీలు బదిలీ కోసం అప్లై చేసుకోగా, 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీలు దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్లు మినహా మిగిలిన అన్ని జిల్లాలలోనూ స్పౌస్ అప్పీళ్లు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. యేడాది క్రితం 19 జిల్లాలకు ఇచ్చి,13 జిల్లాలను బ్లాకులో ఉంచి వివక్ష చూపారని అంటున్నారు.  ప్రమోషన్లు బదిలీల సందర్భంగా తమకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ఉపాధ్యాయ దంపతులకు తీరని ఆవేదన మిగుల్చుతున్నారని వాపోతున్నారు.

 

సీఎం కేసీఆర్ గారే దిక్కు

 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు బదిలీల కోసం యేడాది కాలంగా విద్యాశాఖ మంత్రితో పాటు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లాపాపలతోజిల్లా కేంద్రాలలో, హైదరాబాద్ లో  శాంతియుత నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిరంతరాయంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయ దంపతులు బదిలీల ప్రక్రియ మాత్రం జరగడం లేదు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ మాత్రమే తమ సమస్యకు పరిష్కారం చూపగలరని అంటున్నారు. మౌన దీక్ష ద్వారా ఉపాధ్యాయులు చేస్తున్న ఈ విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి వెంటనే 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు అందరికీ బదిలీలు జరిపించాలని వేడుకుంటున్నారు.

 

టీచర్ల అరెస్టు అన్యాయం

13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల బదిలీలను చేపట్టిన తర్వాతనే షెడ్యూల్ విడుదల చేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర మౌన దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇది అన్యాయం. నేను ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలి.  – ఈటల రాజేందర్, మాజీ మంత్రి, బీజేపీ నేత.