సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
తెలంగాణకు చెందిన ఉమా హారితికి మూడవ ర్యాంక్
ముద్ర, తెలంగాణ బ్యూరో:  సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయభేరి మోగించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. తెలంగాణ చెందిన పలువురు యువతీ యువకులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ దక్కింది. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురైన ఉమా హారతి ఈ ఘనత సాధించింది. హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేసిన  ఆమె తర్వాత సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. సివిల్ సర్వీస్ లో నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించడం విశేషం. టాప్ 4 ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. వారిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించారు. రెండవ ర్యాంక్ గరిమా లోహియా సాధించగా, మూడవ ర్యాంక్ ఉమా హారతి, నాలుగో ర్యాంక్ స్మృతి మిశ్రా సాధించారు.
అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లోనూ మహిళలు తమ  సత్తా చాటారు.  ఈ ఫలితాల్లో  మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు విడుదల చేసిం.  ఇందులో 180 మంది ఐఏఎస్ కు ఎంపిక అయ్యారు. 200 మంది ఐపీఎస్ కు, 38 మంది ఐఎఫ్ఎస్ కు, 473 మంది గ్రూప్ ఏ కేంద్ర సర్వీసులకు, 131 మంది గ్రూప్-డి సర్వీసులకు ఎంపికయ్యారు. మొత్తం 933 మందిలో జనరల్ కేటగిరీలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 99 మంది, ఓబీసీ కేటగిరిలో 263 మంది, ఎస్సీ కేటగిరిలో 154 మంది, ఎస్టీ కేటగిరిలో 32మంది ఎంపికయ్యారు. గతేడాది జూన్ 5న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష జరగగా, 11 లక్షల మందికిపై అభ్యర్థులు హాజరయ్యారు. గతేడాది జూన్ 22న ప్రిలిమినరీ ఫలితాలు రాగా, మెయిన్స్ గత సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగ్గా.. ఫలితాలు డిసెంబర్ 6న విడుదల అయ్యాయి. 2023 మే 18న ఇంటర్వ్యూలు నిర్వహించగా, మంగళవారం తుది ఫలితాలు విడుదలయ్యాయి.
ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు వీళ్లే
సివిల్స్ ఫలితాల్లో  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులకు  ర్యాంకుల పంట పండింది. ఇందులో తిరుపతి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంక్ వచ్చింది. శాఖమూరి శ్రీ సాయి అర్షిత్‌కు  40 వ ర్యాంక్, హెచ్‌ఎస్‌ భావనకు 55వ ర్యాంక్,  కరీంనగర్ కు చెందిన అవుల సాయికృష్ణకు 94వ ర్యాంక్, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ కు చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి  132వ ర్యాంకు, వసంత్‌ కుమార్‌‌కు 157 వ ర్యాంక్, కమతం మహేష్ కుమార్‌కు 200వ ర్యాంక్,  రావుల జయసింహా రెడ్డికి 217, బొల్లం ఉమామహేశ్వర్‌ రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాల్వాయి విష్ణువర్దన్‌ రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్‌ 362, యప్పలపల్లి సుష్మిత 384, కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన డోంగ్రి రేవయ్యకు  410, సీహెచ్‌ శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న తదితర తెలుగు అభ్యర్థులకు 462 ర్యాంకులు వచ్చాయి.