అబ్దుల్లాపూర్ మెట్టు బ్రిల్లింట్ కాలేజ్ లో ఉద్రిక్తత..

అబ్దుల్లాపూర్ మెట్టు బ్రిల్లింట్ కాలేజ్ లో ఉద్రిక్తత..
  • ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు కళాశాల హాస్టల్ నుండి అదృశ్యం.
  • విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణం అని విద్యార్థుల ఆందోళన.
  • విద్యార్థి సంఘాలతో భారీ ధర్నాకు దిగిన విద్యార్థులు

ఇబ్రహీంపట్నం, ముద్ర: బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటనకు కళాశాల యాజమాన్యం కారణమని కళాశాల ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కళాశాల అద్దాలు పగులగొట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలోని బ్రిలియంట్‌ కళాశాలలో డిప్లమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న చాపల ఆంజనేయులు(16) కళాశాలలోని హాస్టల్‌లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్తుండగా.. అతని హాజరు గురించి ప్రతిరోజూ కళాశాల యాజమాన్యం అతని తండ్రికి సమాచారం ఇస్తుండేవారు. అయితే ఈనెల 21, 22 తేదీల్లో తన కొడుకు కళాశాలకు హాజరు కాలేదన్న సమాచారం మేరకు ఆంజనేయులు తండ్రి.. కొడుకుకు ఫోన్‌ చేయగా అతని స్నేహితుడు గంగాసాగర్‌ ఫోన్‌ ఎత్తి ఈ నంబర్‌ను తాను వాడుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఆంజనేయులు తండ్రి కళాశాల వద్దకు వచ్చి హాస్టల్‌ నిర్వాకులను తమ కుమారుడి ఎక్కడున్నాడని ప్రశ్నించగా ఈనెల 20న తమవద్ద ఆంజనేయులు రూ.500 తీసుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు వెళ్లివస్తానని చెప్పి తిరిగి రాలేదని చెప్పారు. ఈ విషయమై హాస్టల్‌ వార్డెన్లు రవీందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఆందోళనలు దిగారు.