ఎర్రజెండానే పేదలకు అండ - సిపిఐ జిల్లా నాయకులు

ఎర్రజెండానే పేదలకు అండ  - సిపిఐ జిల్లా నాయకులు
ముద్ర,పానుగల్:-దేశంలో ఎన్ని రంగుల జెండాలున్నా పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఐ అనుబంధ భారత జాతీయ మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శ్రీరామ్ అన్నారు. పానగల్ మండలం కేతేపల్లి లో సిపిఐ 99వ ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీనియర్ నాయకులు పెద్ద హనుమంతు ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో పార్టీ ఆవిర్భవించిందన్నారు. గత 99 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. దేశ స్వాతంత్రం, నిజాం నుంచి తెలంగాణ విముక్తి పోరాటం చేసిందన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని, 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర సిపిఐ సొంతమన్నారు. పేదలకు పోరంబోకు ప్రభుత్వ భూముల పంపిణీ, పక్కా ఇండ్లు, ఇళ్లస్థలాలు, రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, నిరుద్యోగంపై పోరాడుతోందన్నారు. కమ్యూనిస్టుల పోరాటం వల్లే  ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు దక్కాయ న్నారు.  తెలంగాణలో సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ గెలిచిందన్నారు."ఆరు గ్యారెంటీ" లలో  సంక్షేమ పథకాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తున్నదని  దరఖాస్తు చేసుకోవాలన్నారు.ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు కనిపిస్తారని, ప్రలోభాలతో ఎన్నికల్లో ఓట్లు ఇతర పార్టీలకు వేస్తారని, కమ్యూనిస్టులను గెలిపిస్తేనే, ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని పేద ప్రజల వాణి అసెంబ్లీలో వినిపిస్తారన్నారు.ప్రతి గ్రామంలో సిపిఐ శాఖలను ఏర్పాటు చేసుకొని సమస్యలపై పోరాడాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, వార్డు సభ్యులు పెంటయ్య, అరుణమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ నాయకులు కాకంచిన్న నారాయణ, పెద్ద హనుమంతు, చిన్న రాముడు, కుర్వ హనుమంతు, చిన్న కుర్మయ్య, పరుశురాముడు, చెన్నమ్మ, వెంకటమ్మ, శంకరమ్మ, ఆంజి, కోటయ్య, చాకలి వెంకటస్వామి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.