ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనీయం వెంబడిపడతం-వేటాడుతం

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనీయం వెంబడిపడతం-వేటాడుతం
  • పదవులు-పైరవీలు డబ్బులు తప్పించి హక్కుల గురించి కోట్లాడే సోయి కాంగ్రెస్ నాయకులకు నాడు లేదు నేడు లేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మల రాజ్యం చవటల రాజ్యం
  • 24 గంటల కరెంట్ ఇచ్చేదాకా సర్వస్ కావద్దు-ఏమైందిరా బిడ్డా అని నిలదీయండి
  • మేడిగడ్డ బోతం-బూరుగడ్డబోతం బొందలగడ్డబోతం- ఏం ముంది అక్కడ తోకమట్ట ఉందా అక్కడ ఇది రాజకీయ సభకాదు- ఉద్యమసభ పోరాటసభ
  • మీ అందరి అనుమతితో నేను కూచుని మాట్లాడాల్నా, పరవాలేదా, అని ప్రసంగాన్ని ప్రారంభించిన కేసి ఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసి ఆర్ నినాదాలు, మైకు ఇబ్బందితో పలుమార్లు ప్రసంగానికి అడ్డంకులు
  • కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించిన 'ఛలో నల్లగొండ'లో బి ఆర్ ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసి ఆర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనీయం
వెంబడిపడతం-వేటాడుతం అని, పదవులు - పైరవీలు-డబ్బులు తప్పించి హక్కుల
గురించి కోట్లాడే సోయి కాంగ్రెస్ నాయకులకు నాడు లేదు-నేడు లేదు అని బి
ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ
కోసం నిర్వహించిన 'ఛలో నల్లగొండ'లో సభలో ఆయన ముఖ్యఅతిధిగా
ప్రసంగించారు. కేసి ఆర్ ఒక్క పిలుపుతో కదలివచ్చిన నా అన్నదమ్ములు,
అక్కచెల్లెళ్ళకు నా ఉద్యమాబి వందదనాలన్నారు. ఈ రోజు నల్లగొండలో చలో
నల్లగొండ ప్రోగ్రాం తీసుకున్నం, కారణం ఏంది, ఎందుకు సభ పెట్టాల్సి వచ్చిందని
వివరిస్తూ కాలు విరిగిపోయినా, కుంటి నడకతో కట్టె పట్టుకుని ఎందుకు రావాల్సి
వచ్చిందో తెలుసుకోవాలన్నారు. కొందరికి ఇది రాజకీయం అని, కాని ఇవాళ
మనం పెట్టింది ఉద్యమసభ, పోరాటసభ, ఇది రాజకీయ సభ కానేకాదని స్పష్టం
చేశారు. కృష్ణా జలాల్లో, కృష్ణానదిమీద మన హక్కు అనేది మనందరి బతుకులకు
జీవన్మరణ సమస్య అని, ఈ విషయాన్ని నేను తెలంగాణలో పక్షిలాగ తిరుక్కుంటా
చెప్పబట్టి అందరికి అర్ధం అయ్యిందన్నారు.


తాను 24 ఏండ్ల నుంచి ఇటు కృష్ణా, అటు గోదావరి నీళ్ళ కోసం పోరాడుతూ
నీరు లేకపోతే బతుకులేదని చెప్పానన్నారు. నల్లగొండ జిల్లాలో నడుములు వంగి
పోయినాయని, 1.50 లక్షల మంది ఫ్లోరైడ్ బాదపడుతుంటే ఈ జిల్లాలో
ఉద్యమకారులు, జలసాధన సమితి కలిసి నాటి ప్రధానమంత్రి టేబుల్ పై ఫ్లోరైడ్
బాధితులను పండబెట్టి చెప్పినా పట్టించుకునే నాధుడు లేడన్నారు. ఎంతోమంది
ఎంఎల్ఎలు, మంత్రులు వచ్చినా ఏమీ చేయలేదని, బి ఆర్ ఎస్  ప్రభుత్వం
వచ్చిన తర్వాత  మిషన్ భగీరధ నీరు అందించి జీరో ఫ్లోరైడ్ చేసిందే బి ఆర్ ఎస్ 
ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఏదైనా చేయాలని ఆరాటం ఉంటే
సాధించావచ్చన్నారు. ఆనాడు కోట్లాడినం అని, రాష్ట్రం కోసం, జలసాదన
ఉద్యమంలో మండలానికో బ్రిగేడియర్ను పంపినం అని, తానే పాటలు రాశానని,
పక్కన కృష్ణమ్మ ఫలితం లేకపోయే అని ఏడ్సినం అన్నారు.
బసవాపూర్, డిండి, దేవరకొండ, మునుగోడు ప్రాంతాల ప్రజలు నేడు నీటి
ఫలితాలు అనుభవిస్తున్నారని, పాలమూరు ఎత్తిపోతలు 80 శాతం పనులు పూర్తి
అయినవని, దీంతో పాలమూరు, వికారాబాద్ కు కష్టాలు ఉండవన్నారు. కాంగ్రెస్
ఎన్ని వందల కేసులు వేసినప్పటికీ నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తో
కొట్లాడినామని, తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినందున ఒక యాడాది కోసం
తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నామని, తర్వాత ఎవరి వాటా వారికి వస్తుందని
నెమ్మదించామని, తెలంగాణ బిల్లు పాస్ కావడానికి కాంగ్రెస్ తో విభేదించలేకపోయామని, తర్వాత
మోడి ప్రభుత్వంకు కృష్ణా జలాల విషయంలో వందల ఉత్తరాలు రాశామన్నారు.
తెలంగాణ మునిగిందే నీరులో అని, తెలంగాణ వాటా పంపిణి చేయాలని, ట్రిబ్యునల్
వేయాలని సుప్రీం కోర్టుకు వెళ్ళామన్నారు. సుప్రీం కోర్టులో గట్టిగా నిలదీస్తే,
కేసు వాపసు తీసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామన్న బిజెపి ప్రభుత్వం ట్రిబునల్ వేయకపోవడంతో
బి ఆర్ ఎస్ ఎంపి లు వారం పాటు లోక్ సభను నడవనివ్వలేదన్నారు. దీంతో
వత్తిడికి తలొగ్గి ట్రిబ్యునల్ వేశారని, ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు
చేయాల్సింది ట్రిబ్యునల్ ముందు వాదించి కరువు, నీటి అవసరం, బాధలు
చెప్పి మా వాటా ఇంత రావాలని కొట్లాడాలని, అదీ మొగోడి తెలివని, ప్రజలపై
ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని అని చెప్పారు. మా మీద మీకు ఏమి కోపం 
వచ్చిందో పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని, మూడు నెలల
కాంగ్రెస్ పరిపాలనలో చిన్నచిన్న విషయాలు వదిలేద్దామని, అయితే తెలంగాణ
ప్రజల జీవితాల్ని దెబ్బకొట్టే, తెలంగాణకు జీవన్మరణ సమస్య అయిన కృష్ణాజలాల
విషయాన్ని కె ఆర్ ఎంబికి అప్పచెప్పారని ఆరోపించారు.

నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికంటే ఉమ్మడి
రాష్ట్రం నయం అన్నారని, అదే మంచి దయితే ఇదే జిల్లాకు చెందిన
శ్రీకాంతాచారి, తోబాటు వందలాది మంది ఎందుకు చనిపోయారని, లక్షల కోట్ల
జనం ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రశ్నించారు. కాంగ్రెస్
మంత్రులు సోయి తప్పి మాట్లాడుతున్నారని, హరీష్ రావు అసెంబ్లీలో గర్జించారని
అన్నారు. నాటకాలు, అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచిస్తుందని చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ అతి ముఖ్యం అయినా పక్కకు పెట్టి కె ఆర్ ఎంబిపై హడావుడిగా
తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో కే ఆర్ ఎంబి మీద
రగడ జరుగుతుంటే బజారులో తేల్చుకుంటం అని చలో నల్లగొండకు పిలుపు
ఇవ్వడం జరిగిందని, కృష్ణానది పరిధిలోని ఐదు జిల్లాలకు నాకు చాతన అయినా,
కాకపోయినా, నా కట్టే కాలేవరకు, చివరి శ్వాస దాకా పులి లాగా పోరాడుతా
తప్పించి పిల్లి లాగా ఉండనని, ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం
జరుగనియ్యనని, నల్లగొండ సభ అనగానే కాంగ్రెస్ నాయకులు పిక పిక చచ్చిండ్రని,
ఇజ్జత్, మానం పోతదని చేతులు, కాళ్ళు పిసుక్కుని బడ్జెట్ పక్కకు పెట్టి కృష్ణా
జలాలపై స్పష్టత లేకుండా తెలివితక్కువ తీర్మానం చేసి మమ అనిపించారన్నారు.
 ప్రజలు తమ హక్కులు సాధించడానికి ఉవ్వెత్తున ఎగిసి పడి 
మనల్ని మనం కాపాడుకోవాలని, ఎవరూ మనల్ని కాపాడరని, ఎవరూ ప్రజల
రక్షణకు ఇతరులు రారని , ఓట్లుంటే వచ్చి సంగనాచి మాటలాడి ఓటు గుద్దినాక
గడ్డ కు ఎక్కి, మన వీపుల గుద్ది బొందల నూకుతరన్నారు.

ఇది జరిగిన చరిత్ర అని, జరుగుతున్న చరిత్ర గమనించాలని, ఆషామాషి కాదని, అందుకే ఇది.
చిల్లర మల్లర కారాదని, నీళ్ళ కోసం బ్రిజేష్ కుమార్  ట్రిబ్యునల్, కేంద్ర మంత్రి,
ప్రధాన మంత్రిపై వత్తిడి తేవాలన్నారు. ప్రతి ఇంటిలో నల్లా, మంచినీరు
అందించామని, ఆముదాలు పండే నల్లగొండ, బత్తాయి తోటలతో బతికిన
నల్లగొండలో లక్షల టన్నుల వడ్లు పండించినమన్నారు. ఇవన్నీ ఏడికల్లి
వచ్చినాయని, చేయాలనే ఆరాటం, చేసే దమ్ము, నా ప్రాంతం అనే మమత,
నా గడ్డం అనే ఆరాటం, నా ప్రజలు అని అనుకుంటే ఎట్లన్న సాధించవచ్చన్నారు.
నల్లగొండలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు కరెంట్ పోయిందని, ఏం
మాయరోగం అని, తెలివిలేక, నడపరాక, దద్దమ్మలు, చవటల్లాగా పరిపాలన
చేతగావడం లేదని, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అన్యాయం చేస్తే
బతకనీయం, వెంబడిపడటం, వేటాడుతం అని హెచ్చరించారు. నీరు లేక ఏడ్సిన
తెలంగాణలో 3 కోట్ల టన్నులు వరి పండించినామని, మీకు ఏం బీమారు
వచ్చిందని, పరిపాలన అర్థం అయితలేదా, చేతకాదా అని ప్రశ్నించారు. రైతు
బంధు ఇవ్వకుంటే ఇవ్వకపోతేమాయే రైతులను చెప్పుతో కొట్ట మంటారా, రైతుల
చెప్పులు గట్టిగా ఉంటాయని, కొడితే మూడు పళ్ళు రాలతాయన్నారు.
అన్నదాతలను పట్టుకుని చెప్పుతో కొట్టమంటానికి ఎన్ని గుండెలురా మీకు,
అని, కండకావరామా, కళ్ళు నెత్తికి ఎక్కినాయా  అని, కాంగ్రెస్ నాయకులు నోటి
దురుసు తగ్గించుకోవాలని హితవు పలికారు. కేసి ఆర్ ని తెలంగాణలో
తిరగనియ్యకుంటా  చేసే మొగోళ్ల మీరు అంటూ కాంగ్రెస్ నాయకులపై నిప్పులు
చెరిగారు.

తెలంగాణలో తిరిగితే చంపుతారా, ఏ పాటి చంపుతారో చూద్దాం
రండని, కేసి ఆర్ నీ చంపి మీరుంటారా, ఇది పద్దతా, ప్రతిపక్షం అనేది ప్రజల
సమస్యలపై పోరాడతదని, దమ్ముంటే మంచిగ కరెంట్ ఇవ్వండని, ఆగమాగం,
అడివి అడివి అయిపోతరని ఎద్దేవా చేశారు. పాలమూరు, సీతారామ పూర్తి
చేయాలని, గురుకులాలు ఇంకా పెంచాలని, కరెంట్, మంచినీరు సక్రమంగా
ఇవ్వాలని, మాయమాటలు చెప్పితే బలాదూర్ గా తెలంగాణలో తిరుగనివ్వమని,
ఎక్కడికక్కడ తిరగనివ్వం, నిలదీస్తం, ఎండగడం అని, దమ్ముంటే ప్రాణహితలో
ఐదు వేల క్యూసెక్కుల నీరు ఉందని, ఎత్తిపోయాలని, మహబూబాబాద్, డోర్నకల్,
సూర్యాపేట, తుంగతుర్తిలకు నీరు తగ్గిందన్నారు. తాము కూడా మేడిగడ్డకు
పోయి నీరున్నా ఇవ్వలేని మీ బండారం బయటపెడ్తామన్నారు.

కాళేశ్వరం అంటే ఆటబొమ్మకాదన్నారు. నాగార్జునసాగర్ కుంగి పోలేదా, కడెం, మూసీ గేట్లు ఊడిపోలేదా, ఇది
రాజకీయమా, రాజకీయాల్లో ఓడోచ్చు గెలవొచ్చని, ఏదీ శాశ్వతం కాదని,
డబుల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తామన్నారు. ప్రజల తరపున హక్కుల కోసం
ప్రశ్నిస్తే అహంకారంతో ప్రవర్తిస్తారా, చావునోట్లో తలపెట్టి 24 ఏండ్లుగా పోరాటం
చేసి తెలంగాణ తెస్తే కండకావరంతో కాంగ్రెస్ వాళ్ళు ప్రవర్తిస్తారా, కె ఆర్ ఎం బి విషయంలో అడిగితే సలహా ఇవ్వలేమా, ఏ మాత్రం
నెమ్మదించినా, నిద్రపోయినా బొండిగపిసికి బొందపెడతారని, కాంగ్రెస్ దమననీతిని
ఎండగట్టి వెంటాడుతమని, తెలంగాణ ప్రజల కోసం నాడు మోడీ మీటర్లు,
పెట్టాలన్నా 25 వేల కోట్ల రూపాయలు ఇవ్వకున్నా రైతుల పక్షాన నిలిచానని,
ప్రతి పల్లె పచ్చగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని విశ్వసించానని, కాంగ్రెస్
నాయకుల పనికిమాలిన మాటలకు భయపడనని, చెప్పారు. తెలంగాణ హక్కుల
కొట్లాడి పోరాడి నిలబడాలని పిలుపిచ్చారు. ఇంకా ఈ సభలో మాజీ మంత్రి
సూర్యాపేట ఎంఎల్ఎ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎంపిలు నామా నాగేశ్వర్రావు,
కేశవరావు, సంతోష్ కుమార్ , పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు కేటి ఆర్ హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సునీత ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, పల్లా
రాజేశ్వర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లాపరిషత్ చైర్పర్సన్
గుజ్జదీపికాయుగంధర్రావు తదితరులు పాల్గొన్నారు.