డీఈఓ ను విధులనుంచి తప్పించి సమగ్ర విచారణ చేపట్టాలి

డీఈఓ ను విధులనుంచి తప్పించి సమగ్ర విచారణ చేపట్టాలి

జిల్లా కలెక్టర్ కు  ఎస్ టి యు  వినతి పత్రం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : విధుల పట్ల నిర్లక్ష్యం,  పర్యవేక్షణ లోపం, నిబంధనలు అతిక్రమించి  పలు అక్రమ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న డి ఈ ఓ జగన్ మోహన్ రెడ్డి గారిని విధుల నుంచి తప్పించి ఆయనపై  సమగ్ర విచారణ చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, మచ్చ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  20 ఏళ్లు అనధికారిక  సెలవు పై విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన  ఉపాధ్యాయుడికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడం,  గతంలో 10  ఏళ్లు  జగిత్యాల డిప్యూటీ ఈవో  పనిచేసి, గత 4 ఏళ్లుగా  డీఈవోగా పనిచేస్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి బాధ్యత పర్యవేక్షణ లోపం అన్నారు.

సాధారణంగా సి సి ఎ నిబంధనల ప్రకారం  ఐదు సంవత్సరాల పైబడి అనధికారిక  సెలవుపై వెళ్తే ఉద్యోగిని పలు నోటీసులు జారీ చేసి టెర్మినేట్  చేయాలని ప్రభుత్వ  ఉత్తర్వులు ఉన్నా వాటిని  అమలు చేయకుండా ఇన్ని  సంవత్సరాలు తాత్సారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో  అని ప్రశ్నిచారు. ఆ ఉత్తర్వులు సక్రమమైతే ఇదే తరహాలో లీవ్ పై వెళ్లిన అందరికీ తిరిగి నియమకపు ఉత్తర్వులు  ఇవ్వాలని కోరారు. 26 సంవత్సరాలుగా గతంలో కరీంనగర్ కేంద్రంలో మొన్నటి వరకు జగిత్యాల కేంద్రంలో ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలో ఒక  అర్హత లేని ఉపాధ్యాయురాలితో ప్రభుత్వ  విద్యాబోధన గావించడం విడ్డూరంగా ఉందని, విద్యార్థుల ఉజ్వల  భవిష్యత్ తో ముడి పడి ఉన్న ఈ అంశంలో  బాధ్యత గల జిల్లా  ఉన్నత అధికారిగా ఉండి  ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ఖజానాను అక్రమ మల్లింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే రెగ్యులర్ డి ఇ ఓ ను నియమించాలని, పలు అక్రమాలకు పాల్పడుతూ, పలు అవినీతి ఆరోపణలు ఉన్న  డీఈఓ ను  విధుల నుండి వెంటనే  తప్పించి లోతైన  విచారణ చేపడితేనే పూర్తి పారదర్శకంగా ఉంటుందని లేకపోతే సాక్ష్యాలను,  తదితర ఫైళ్ళను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు.