వరదలు బాధాకరం..

వరదలు బాధాకరం..
  • ప్రభుత్వం అప్రమత్తతతో ఉండాల్సింది
  • శాశ్వత పరిష్కారం చూపాలి
  • సహాయక చర్యల్లో వేగం పెంచాలి
  • ముంపు ప్రాంతాల సందర్శన
  • గవర్నర్ తమిళ సై
  • భద్రకాళి అమ్మవారి దర్శనం

ముద్ర ప్రతినిధి, వరంగల్:గ్రేటర్ వరంగల్ ను వరదలు ముంచెత్తడం బాధాకరమని, ప్రభుత్వం మరింత అప్రమత్తతతో ఉంటే నష్టాన్ని నివారించే అవకాశం ఉండేదని రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వరదలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో గవర్నర్ బుధవారం పర్యటించారు. నగరంలోని జవహర్ నగర్, నయీమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్, భద్రకాళి చెరువు గండి పడిన ప్రాంతాన్ని గవర్నర్ పర్యటించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరదలు సంభవించడానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు కాలనీలో పర్యటిస్తూ బాధితులతో మాట్లాడారు. అధైర్య పడద్దంటూ మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. సర్వం కోల్పోయామంటూ ముంపు బాధితులు గవర్నర్ కు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. 

  • అప్రమత్తంగా ఉండాల్సింది.. 

జవహర్ నగర్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాలను వరదలు ముంచెత్తడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే నష్టాన్ని నియంత్రించే అవకాశం ఉండేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడంతో నష్టం తీవ్రంగా వాటిల్లిందన్నారు. వరద తాకిడికి దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత బాధితులను ఆదుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులకు సూచించానని వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎందుకు రావాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యవసరుకులు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో వర్షం పడితే చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలని సూచించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇప్పటికే పరిశీలించినట్లు తెలిపారు. సమావేశంలో కమిషనర్ రిజ్వాన్ భాషా, వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ విజయ చందర్ రెడ్డి, ఈవి శ్రీనివాస్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాకేష్ రెడ్డి, కుసుమ సతీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. 

  • గవర్నర్ కు ఘన స్వాగతం.. 

రాష్ట్ర గవర్నర్ వరంగల్ హనుమకొండ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 8:30 కు నిట్ కళాశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఆర్డీవోలు రమేష్ కుమార్, వాసు చంద్ర లు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. 

  • భద్రకాళి అమ్మవారి దర్శనం..

గవర్నర్ భద్రకాళి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తమిళి సై సౌందర రాజన్ కు ఘన స్వాగతం  పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు గవర్నమెంట్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ పరిసరాలలో ఉన్న ఆవులకు గడ్డి తినిపించారు.