ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్‌ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజేఐ, విపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంటులో  చట్టం చేసేంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది.  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) నియామకాలకూ కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ నిర్వహించిన ఈ తీర్పును వెల్లడించింది.