సూర్యాపేట మున్సిపల్ సమావేశంలో రసాభాస

  • మీడియాను సమావేశ హాలు లోకి అనుమతించాలని పట్టుబట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
  • మీడియాకు అనుమతి లేకుండా చేసిన జీవోను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశము గురువారం హాట్ హాట్ గా సాగుతుంది. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిలర్లు మీడియాని లోపలికి అనుమతించాలని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, అధికారుల అవినీతి బయటకు పొక్కకుండా, మీడియాలో రాకుండా మీడియాకు అడ్డు కట్ట వేయటం ఏమిటని కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ సమావేశాలలోనికి మీడియాకు అనుమతి ఉండేదని,  బీ ఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక కరోనా పేరుతో ఆంక్షలు విధించారని, వెంటనే మీడియాకు అనుమతిస్తూ గతంలో ఉన్న జీవోను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశం రసాభాసగా కొనసాగుతుంది. టిఆర్ఎస్ నుంచి 17 మంది కౌన్సిలర్లు బుధవారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దీంతో సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. గురువారం జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు పలు విషయాలపై, మున్సిపాలిటీలో జరిగిన జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చైర్పర్సన్ వైస్ చైర్మన్, అధికారులను ప్రశ్నించడంతో ఒక దశలో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జోరుగా కొనసాగుతుంది. 

ఇరుపక్షాల  కౌన్సిలర్లు జోరుగా మొత్తుకుంటూ, కేకలు వేస్తూ, బల్లలు చరుస్తూ మైకులను అడ్డుకుంటూ ఉండటంతో సమావేశంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ఒక్కసారిగా మాట్లాడుతుండడంతో ఎవరే మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మీడియా బయటనే ఉండి సమావేశాన్ని కవర్ చేయాల్సి వస్తుంది.