యుసిసి బిల్లు పార్లమెంట్ లో పెట్టాలి

యుసిసి బిల్లు పార్లమెంట్ లో పెట్టాలి

శివసేన కార్యకర్తలు ప్రదర్శన, అరెస్ట్ 
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం  హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శివసేన పార్టీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శివనేన పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ మాట్లాడుతూ.. ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు తమను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసారని ఆరోపించారు. ఎన్ని అరెస్టు లు చేసిన సరే యుసిసి బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంద వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. 

ఒకే దేశం, ఒకే చట్టం రావాలని ఆనాడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ యుసిసి కోసం కృషి చేశారన్నారు.  యుసిసి అమలుతోనే కులం, మతం, వర్గం భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు లభిస్తాయన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భయపడిన సిఎం కేసీఆర్ యుసిసి బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.  అసదుద్దీన్ ఓవైసీ, ఫారుఖ్ అబ్దూల్లా లాంటి నేతలు అడ్డుకున్నా యుసిసి అమలు మాత్రం ఆగదన్నారు.