రైతుపై బీఆరెస్ నేత దాడి పై భగ్గుమన్న అన్నదాతలు

రైతుపై బీఆరెస్ నేత దాడి పై భగ్గుమన్న అన్నదాతలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రైతు గోడును ఆలకించి పరిష్కరించవలసిన అధికార పార్టీ నేతలు సహనం కోల్పోయి భౌతిక దాడులకు దిగుతున్నారు. దండెపల్లి మండలం కాసిపేట గ్రామంలో ఆదివారం జంగిలి ముత్తయ్య పై బీఆరెస్ నాయకుడు కోడి రాజేష్ దాడి చేయడం పట్ల అన్నదాతల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు తనయుడు విజిత్ సమక్షంలో ఈ ఘటన జరగడం తో రైతులు మరింత మండిపడుతున్నారు. విజిత్ రావు పాదయాత్ర సందర్భంగా ముత్తయ్య ధాన్యం కొనుగోలులో కోత విధించడాన్ని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు నిర్వహకుడైన కోడి రాజేష్ జోక్యంతో ఇరువురి మధ్య వాదనలు శృతిమించాయి. ధీంతో రాజేష్ ముత్తయ్యను పిడిగుద్దులు గుద్దడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురు గొడవ పడుతున్నప్పటికి విజిత్ వారిని వారించే ప్రయత్నం చేయ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయపడిన ముత్తయ్యను ఆసుపత్రికి తరలించారు. రైతు పై అధికార పక్ష నేత దాడి చేశాడని ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. ధీంతో ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలకు దిగారు.

  • దాడి అమానుషం : ప్రేమ్ సాగర్ రావు

మరోవైపు కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రైతుపై జరిగిన దాడిని నిశితంగా ఖండించారు. ధాన్యం కొనుగోలులో కోత విధించడాన్ని నిలతీసిన రైతును చితకబాదడం అమానుషమని అన్నారు.