గుండెపోటు వచ్చినా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్.. 

గుండెపోటు వచ్చినా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్.. 

ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: విధి నిర్వ‌హ‌ణ‌లో త‌న ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా ఓ ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ ప్ర‌యాణీకుల ప్రాణాల‌ను కాపాడాడు. త‌న‌కు ప్రాణ‌పాయం ఉంద‌ని తెలిసినా ప్ర‌యాణీకుల ప్రాణాలే ముఖ్య‌మ‌ని భావించి బస్సును సురక్షితంగా నిలిపాడు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. దేవరకొండ బస్ డిపో కు చెందిన ఏపీ24జెడ్0104 ఎక్స్ ప్రెస్ బస్సు 20 మంది ప్రయాణికులతో నల్లగొండ జిల్లా మల్లెపల్లి నుండి హైద్రాబాద్ కు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం దాటగానే డ్రైవర్ ఉడావత్ శంకర్ నాయక్ కి గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేర్చేందుకు యత్నించాడు. ఆరోగ్యం క్షిణించడంతో బొంగుళూర్ గేట్ సమీపంలో బస్సు రోడ్డు పక్కన నిలిపివేసి స్టేరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే బస్సు కండక్టర్, ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి శంకర్ నాయక్ కు చికిత్స అందిస్తున్నారు.