పాత అలైన్మెంట్ ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ రైతుల ఆందోళన

పాత అలైన్మెంట్ ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ రైతుల ఆందోళన

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామం నుంచి వెళ్తున్న బైపాస్ రోడ్డు ను పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలని ఆ గ్రామ రైతులు జగిత్యాల, పెంబట్ల రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు తమ స్థలంలోంచి అలైన్మెంట్ పోతుందని అధికారం ఉపయోగించి అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఒకరిద్దరు స్థలాలు పోతుండగా ప్రస్తుతం కొత్త అలైన్మెంట్ ప్రకారం 40 మంది రైతుల భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మూడు నుంచి 10 గుంటల వరకు ఉంటుందని అది బైపాస్ రోడ్ లో పోతే   తమ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది అన్నారు. అధికారులకు ఎన్ని మార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ భూములు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.