మృత్యు ఒడి నుంచి జనంలోకి...

మృత్యు ఒడి నుంచి జనంలోకి...
  • నిర్మల్ ఏరియా ఆసుపత్రి వైద్యుల ఘనత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 12న జరిగిన హత్యా యత్నంలో పొట్టనుంచి ప్రేవులు బయటకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకునికి జీవం పోశారు నిర్మల్ ప్రధానాసుపత్రి వైద్యులు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ లోని బంగల్ పేట సమీపంలో జరిపిన ఈ హత్యా యత్నంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు.

వెంకటేష్ కు తీవ్ర గాయాలై పొట్ట నుంచి ప్రేవులు బయటకు వచ్చిన స్థితిలో ఆసుపత్రిలో చేర్చారు. ఈ స్థితిలో పల్స్ రేటు పడిపోయి తీవ్ర రక్త స్రావంతో బతికే అవకాశాలు లేని పరిస్థితి. ఈ మేరకు డ్యూటీ వైద్యులు గణేష్, రమ్య దాదాపు మూడున్నర గంటల పాటు శస్త్ర చికిత్స చేశారు. తెగిన ప్రేవులు తొలగించి అతికించారు. ఎట్టకేలకు ఇరవై రోజుల తర్వాత గాయాలు మాని నూతన జీవితం పొందిన వెంకటేష్ ప్రాణ దానం చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.