కాలం వదిలిన గురుతు

కాలం వదిలిన గురుతు

శిథిలావస్థలో తొలి తెలుగు ముద్రణాలయం
1922లో ఇనుగుర్తిలో ప్రారంభించిన ఒద్దిరాజు సోదరులు
మద్రాసు నుంచి ప్రింటింగ్ మెషిన్ దిగుమతి
అక్కడి నుంచే వెలువడిన మొదటి ‘తెనుగు పత్రిక' 
విజ్ఞాన ప్రచారిణి పేరిట అనేక గ్రంథాల ముద్రణ
పునరుద్ధరించాలంటున్న సాహితీ అభిమానులు

కాలం ఎన్నో గురుతులను వదిలిపోతూ ఉంటుంది. వాటిని తీయగా స్మరించుకోవడం మన కర్తవ్యం. గురుతులను పదిలపరుచుకోవడం కూడా మన బాధ్యతే. లేకపోతే కాలం వదిలిన అనుభూతులు ముందు తరాలకు లభించే, ఉపయోగపడే అవకాశం ఉండదు. తెలంగాణలో, అదీ గ్రామీణ ప్రాంతంలో  మొట్టమొదటిసారిగా నెలకొల్పిన తొలి తెలుగు ముద్రణాలయం ఇపుడు శిథిలావస్థలో కునారిల్లుతున్నది. అనేక సంవత్సరాలు ప్రజలకు మేధో సంపదను పంచిపెట్టిన ఆ ముద్రాణాలయం, దానిని అపురూపంగా ఒడిలో  పొదుముకున్న ఇల్లు ఇపుడు గత కాలపు వైభవంగా నిలిచిపోయాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారి జీర్ణావస్థకు చేరుకున్నాయి. సర్కారు ఇప్పటికైనా కదులుతుందా?!   

కేసముద్రం, ముద్ర: 
తెలంగాణ ప్రాంతంలో తొలి తెనుగు పత్రిక అచ్చు వేసిన ముద్రణాలయం శిథిలావస్థకు చేరింది. వందేళ్ల క్రితం నిజాం సర్కారు పాలనలో అప్పటి నైజాం ప్రభుత్వ అనుమతితో 1922 ఆగస్టు 22న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు సోదరులు విజ్ఞాన ప్రచారిణి పేరుతో ముద్రణాలయాన్ని స్థాపించారు. ఆ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే తెలుగులో కొన్ని పత్రికలు అచ్చు వేసేవారు. తెలంగాణ ప్రాంత ప్రజలలో  చైతన్యాన్ని తీసుకురావడానికి పత్రికల ప్రాముఖ్యతను గుర్తించిన ఒద్దిరాజు సోదరులు పట్టుదలతో ఇనుగుర్తిలో తొలి తెలుగు దినపత్రిక ముద్రణకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ప్రచురించే విధంగా తమ ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకున్నారు. మద్రాసు నుంచి వీరన్నశెట్టిని సంప్రదించి  ప్రత్యేకంగా పెడస్టల్ ప్రింటింగ్ ప్రెస్ తెప్పించుకున్నారు.

తమ రచనలతో పాటు ఇతరుల రచనలను ముద్రించి విజ్ఞాన ప్రచారిణి ద్వారా ‘తెనుగు పత్రిక'ను ఆరేళ్లపాటు ఇనుగుర్తి లో నిర్విరామంగా నిర్వహించారు.  నెలకు ఒక గ్రంథం అచ్చు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పని భారము లేకుండా ఊరిలోవారు కొందరికి కూర్పు, ముద్రణ, బైండింగు పనులను నేర్పించారు. బ్రాహ్మణ సాహసము, వరాహ ముద్ర,  వీరావేశము, రుద్రమదేవి, శౌర్యశక్తి, భ్రమర, భక్తిసార చరిత్రము, ఛాయాగ్రహణ తంత్రము,  ప్రేమ వివాహము, పంచకూట కషాయము, చేతి పనులు, విషములు–-చికిత్సలు, ఉత్తర గురుపరంపర, బాల విజ్ఞాన మంజూష మొదలగు పుస్తకాలను అచ్చు వేశారు. చాట్రాతి నర్సమాంబ రాసిన 'అనురాగ విపాకము' ను కూడా ముద్రించారు. నల్లగొండ శబ్నవీసు వారి ' నీలగిరి' పత్రికను కూడా ఈ విజ్ఞాన ప్రచారిణిలోనే ముద్రించి, విడుదల చేశారు. 

ఊరిలోనే పోస్టాఫీసు
ఒద్దిరాజు సోదరులు పత్రికల పంపిణీ కోసం ఇనుగుర్తి గ్రామములో పోస్ట్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయించారు. కొద్దికాలంలోనే పత్రిక సర్కులేషన్ 500 నుంచి 1000కి పెరిగింది. దేవులపల్లి వెంకట చలపతి రావు, తూము వరదరాజులు మొదలగువారి సలహాతో ముద్రణాలయాన్ని ఇనుగుర్తి నుంచి వరంగల్ కు తరలించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి పత్రిక మూత పడింది. ఇనుగుర్తిలో తెలంగాణ ప్రాంతంలో తొలి తెలుగు పత్రిక పురుడు పోసుకున్న  ఒద్దిరాజు సోదరుల స్వగృహం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. ఒద్దిరాజు సోదరుల వారసులు ఇతర ప్రాంతాలలో  స్థిరపడగా, చరిత్రకు నిలయమైన ఆనాటి విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయం ఆలనా పాలన లేక అధ్వాన స్థితికి చేరింది.

విజ్ఞాన వ్యాప్తికి దోహదం
ఒద్దిరాజు సోదరులు విజ్ఞానదాయక పుస్తకాలను ప్రచురించి తెలంగాణలో విజ్ఞానవ్యాప్తికి తోడ్పడ్డారు. నిజాం కాలంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి అండగా నిలిచారు. వీరు ఆంగ్లం, ఉర్దు, పారసీక, సంస్కృత భాషలలో పండితులు. సంగీతం, సాహిత్యంలోనూ నిష్ణాతులు. చరిత్ర, విజ్ఞానశాస్త్రం, వైద్యం మొదలైన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఎన్నో వ్యాసాలను వ్రాశారు. పీవీ నరసింహారావు  ప్రధానిగా ఉన్నపుడు హైదరాబాదులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ స్వర్ణోత్సవ సభలో ఒద్దిరాజు సోదరులు చేసిన భాషా సేవలను ప్రశంసించారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు కుమారుడు వెంకటనరసింహారావు ఆధ్వర్యంలో రంగరాజు వెంకటేశ్వర్ రావు, ఒద్దిరాజు మురళీధర్ రావు, ఇతర మిత్రుల సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఒద్దిరాజు సోదరుల ‘శతజయంతి’ ఉత్సవాన్ని 25-–9–-1995న నిర్వహించారు.  చరిత్రకు నిదర్శనమైన తెలంగాణలో తొలి తెలుగు దినపత్రిక విజ్ఞాన ప్రచారిణి ముద్రిత కేంద్రం కాలగర్భంలో కలిసి పోతుండడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎంతో ఘన చరిత్ర కలిగిన ముద్రణాలయాన్ని బాగు చేసి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకు కృషి చేయాలని సాహితీ ప్రియులు కోరుతున్నారు.