లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్...

లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్...

ముద్ర,తెలంగాణ బ్యూరో:- కేసముద్రం ఫ్లైఓవర్ వద్ద ఇసుక లోడ్‌తో వస్తున్న లారీని.. పక్కకు ఆపాలంటూ సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుళ్లు బెదిరించారు. కొద్ది దూరం ముందుకు వెళ్లడంతో లారీ డ్రైవర్‌ను వెంబడించి.. డ్రైవర్‌ను కిందికి లాగి చేయి చేసుకున్నారు. ఎందుకు కొడుతున్నారంటూ లారీ డ్రైవర్ గట్టిగా అడగటంతో.. డ్రైవర్ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పించారు. కేవలం డ్రాయర్‌తో నడిరోడ్డుపై నిలబెట్టారు. ఆ డ్రాయర్‌ను కూడా చేత్తో పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే.. మధ్య సేవించి లారీ నడుపుతున్నాడని.. అడిగితే అద్దాలు పగలగొట్టారంటూ డ్రైవర్ మీద ఆరోపణలు చేశారు. అక్కడే ఉన్న స్థానికులకు సీన్ అర్థమై.. సదరు డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయాలని పట్టుబడితే.. మిషన్ పని చేయట్లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇందుకు సబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రోజూ రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక లారీలతో పాటు పాసింగ్ లోడుతో వచ్చిన లారీలను కూడా వదిలిపెట్టకుండా ఇద్దరు కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పని చేసిన పోలీస్ స్టేషన్‌లలో కూడా వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.ఇసుక లారీ డ్రైవర్ ను ఘోరంగా కొట్టిన ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో కేసముద్రం పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.