అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తం

అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తం
  • నాలుగేళ్లుగా పూడిక తీయని ప్రధాన డ్రయినేజ్

ముద్ర ప్రతినిధి , కోదాడ :- కోదాడ పట్టణంలో అంతర్గత రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి . ముఖ్యంగా అనంతగిరికి వెళ్లే రోడ్డు ఐటిఐ కాలేజీ వరకు , నయానగర్ ప్రధాన వీధి ఖమ్మం ఎక్స్ రోడ్డు వరకు , కట్టకమ్మగూడెం రోడ్డు హుజూర్ నగర్ రోడ్డు నుండి బై పాస్ జంక్షన్ వరకు , గుడిబండ వెళ్లే రోడ్డు ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి బైపాస్ ఫ్లై ఓవర్ వరకు , శ్రీమన్నారాయణ కాలనీ ప్రధాన వీధి  ఎల్ఐసి ఆఫీస్ నుండి కట్టకమ్మగూడెం రోడ్డు వరకు , విజయవాడ రోడ్డు నుండి అల్వాల పురం గ్రామం మరియు  భవాని నగర్ లోని వీధుల, గోపిరెడ్డి నగర్ , శ్రీమన్నారాయణ కాలనీ , రెడ్ చిల్లీ వెనుక , కెఎల్ఆర్ కాలనీ , టీచర్స్ కాలనీ , ఆజాద్ నగర్ , అంబెడ్కర్ కాలనీ లలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి అడుగుకో గుంత తయారయింది . వర్షం వస్తే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది .

కొన్ని రోడ్లు వేసి ఏళ్ళు గడుస్తుండగా , కొన్ని రోడ్లను మిషన్ భగీరథ సమయంలో తవ్వి వదిలెయ్యడం , మరికొన్ని గ్యాస్ పైప్ లైన్ వేసేందుకు , నెట్వర్క్ కేబుల్స్ వేసేందుకు ఇలా రకరకాల కారణాలతో రోడ్లను తవ్వి వదిలెయ్యడంతో మున్సిపల్ పరిధిలో అంతర్గత రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి . వర్షాకాలం కావడంతో పెద్ద పెద్ద గోతులలో వర్షపు నీరు చేరి వాహనదారులకు గుంత అర్ధం అవ్వక ప్రమాదాల భారీన పడుతున్నారు . ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు , ఆర్ అండ్ బి అధికారులు చొరవ తీసుకోని గుంతలు పూడ్చాలని పట్టణ వాసులు కోరుతున్నారు . 

పూడిక తియ్యక - వ్యర్ధాలు కదలక

పట్టణంలో ప్రధాన రహదారి వెంట ఉన్న మెయిన్ డ్రయినేజి కాలువ పూడిక తియ్యక సుమారు నాలుగు సంవత్సరాలు అవుతుండటంతో వర్షం వస్తే మెయిన్ రోడ్డు మొత్తం అధ్వానంగా తయారవుతుంది . డ్రయినేజి పొంగి మురుగు నీరు మొత్తం రోడ్డు పైకి చేరి దుర్వాసన వస్తుంది . పట్టణంలో దోమల వ్యాప్తికి ప్రధాన కారణం కూడా ఇదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు . ఈ ప్రధాన కాలువ నాలుగేళ్లుగా పూడిక తియ్యక పోవడం అది నిండి వ్యర్ధాలు కదలకపోవడంతో మెయిన్ రోడ్డులో ఉన్న దుకాణదారులు దుర్వాసన తో పాటు ఈగలు , దోమలతో ఇబ్బందులు పడుతున్నామని  వాపోతున్నారు . ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని పలువురు కోరుతున్నారు.