దద్దరిల్లిన పార్లమెంట్​

దద్దరిల్లిన పార్లమెంట్​
  • మణిపూర్​హింసపై నాలుగో రోజూ విపక్షాల పట్టు
  • 267 అధికరణ కింద చర్చ చేపట్టాలని డిమాండ్‌
  • అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్లాన్
  • ఇండియా కూటమి నిరాశలో ఉంది : మోడీ
  • మహిళల కన్నీళ్లు తుడిచేది మేమే : రాహుల్​గాంధీ
  • బ్రిటిశ్​వాళ్ల బానిసలు బీజేపీ రాజకీయ వారసులేనన్న ఖర్గే

న్యూఢిల్లీ: మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. నినాదాలతో నాలుగు రోజులుగా లోక్‌సభ, రాజ్యసభ దద్దరిల్లాయి. అన్ని వ్యవహారాలు పక్కన పెట్టి తక్షణమే మణిపూర్‌ హింసపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా పార్లమెంట్‌లో చర్చ ప్రారంభం కావడం లేదు. లోక్‌ సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకే స్పీకర్‌ మొగ్గు చూపుతున్నారు. విపక్షాలు దాన్ని అడ్డుకోవడంతో సభలో గందరగోళం చోటుచేసుకుంటోంది. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు స్పీకర్‌ సిద్ధమయ్యారు. కానీ మణిపూర్‌ అంశంపై చర్చకు పట్టుబట్టి విపక్షాలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్వీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

  • రాజ్యసభలోనూ అంతే..

లోక్‌సభతో పోల్చితే రాజ్యసభ ఒకింత ప్రశాంతంగా ఉన్నా అక్కడ కూడా చర్చకు సంబంధించి నియమాల విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. రాజ్యసభ నిబంధన 267 కింద తొలుత చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే ముందుగానే స్వల్పకాలిక చర్చకు తాను అనుమతించానని సభాధ్యక్షుడు జగదీప్‌ ధన్కడ్‌ స్పష్టం చేయడంతో విపక్షాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో సభాధ్యక్షుడు మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వాయిదా వేశారు. 

  • విపక్ష కూటమి నిస్పృహలో కూరుకుపోయింది : మోడీ

ఉభయ సభలు జరిగే ముందు బీజేపీ నేతలతో ప్రధాని సమావేశమై విపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టేందుకు అవలంబించాల్సిన విధానాలపై చర్చించారు. అనంతరం ప్రధాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. విపక్ష పార్టీల కూటమి తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిందన్నారు. విపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియన్ ముజాహీదీన్, ఈస్ట్​ ఇండియా కంపెనీల్లో కూడా భారత్ పేర్లు ఉన్నాయని దేశం పేరు చెప్పి మరోమారు దేశ ప్రజలను వంచించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అసలు విపక్షాలు ఏర్పాటు చేసిన కూటమికి దిక్కేలేదన్నారు. మణిపూర్ అంశంపైనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసపై చర్చ కొనసాగిద్దామంటే విపక్ష పార్టీల కూటమి తప్పించుకునేందుకు చూస్తుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మణిపూర్​ఘటనపై పార్లమెంట్​లో చర్చ జరగనీయలేదనే అవాస్తవాలను ప్రజల్లో ప్రచారం చేసేలా విపక్షాలు ప్రయత్నిన్నాయని ఆరోపించారు. కానీ దేశ ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. దేశహితం కోసం పనిచేసేదెవరో వారికి బాగా తెలుసన్నారు. 

  • హింసకు మేం వ్యతిరేకం : రాహుల్​గాంధీ

దేశంలోని హింసకు కాంగ్రెస్​ పార్టీ కూటమి ఇండియా ఎన్నటికీ కోరుకోదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ అన్నారు. హింసకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న దాడులపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు. మహిళల కన్నీళ్లు తుడవడం తమ బాధ్యత అని రాహుల్​పేర్కొన్నారు. మణిపూర్​హింసను రూపుమాపేందుకు కేంద్రం, ప్రధాని తమతో కలిసి రావాలని పిలుపునిస్తున్నామని రాహుల్​అన్నారు.

  • 267 అధికరణ కింద చర్చ జరగడం లేదు : ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ మణిపూర్ అంశంపై 267 అధికరణ కింద చర్చ జరగాలని తాము కోరుకుంటున్నా కేంద్రం ఒప్పుకోకపోవడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇందులో కేంద్రం హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఓ వైపు నిత్యావసర ధరల పెరుగుదల, మరోవైపు కేంద్ర సంస్థల అధికార దుర్వినియోగం, దాడులతో బీజేపీ విపక్ష పార్టీలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ‘మదర్ ఇండియా’ అంటే ‘భారత్ మాత’తోనే ఉందని, బ్రిటిశ్​వాళ్ల బానిసలు బీజేపీ రాజకీయ వారసులేనని అన్నారు. ప్రధాని మోడీ తన వాక్చాతుర్యంతో దేశం దృష్టిని మరల్చడం మానేయాలని అన్నారు. ఇప్పటికే పలుమార్లు ఇది నిరూపితమైందన్నారు. అనంతరం ఖర్గే ఛాంబర్‌లో జరిగిన విపక్ష నేతల సమావేశంలో కేంద్రంపై ఆయా అంశాలపై ప్రస్తావిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని చర్చించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపుర్ అల్లర్లతో సహా అనేక కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందని విపక్షాల ఆలోచనగా కనిపిస్తోంది. కాగా ప్రధాని మణిపుర్‌పై ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడటంతో వారు వెనక్కి తగ్గుతారని కేంద్రం భావించడం లేదు. దీంతో ఇక బిల్లులు ప్రవేశపెట్టడంపైనే దృష్టి పెడుతోంది.