మంచిర్యాల లో సిట్టింగులు పదిలం

మంచిర్యాల లో సిట్టింగులు పదిలం
  • ముగ్గురికి టికెట్ ఖరారు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేశారు. సోమవారం బీఆరెస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు చోటు లభించింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెళ్లి దివాకర్ రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలకు మరోసారి ఎన్నికల గోదాలోకి దిగేందుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. దుర్గం చిన్నయ్య పై ఓ యువతి లైంగికంగా వేధించాడని అలుపెరగని పోరాటం చేయడంతో ఆయనకు టికెట్ రావడంపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఇకపోతే దివాకర్ రావు కు పోటీగా చలన చిత్ర అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పుస్కురి రామ్మోహనరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. టికెట్ తనకేనని ధీమా వ్యక్తం చేయడంతో దివాకర్ రావుకు టికెట్ లభించేనా అనే సంశయం వ్యక్థమైంది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ కేసీఆర్ సిట్టింగ్ లకు టికెట్ లు ఇచ్చారు. 

  • ఐదవసారి అసెంబ్లీలో అడుగుపెట్టేనా

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ఐ దవసారి అసెంబ్లీలో అదిగుపెట్టేనా అనేది చర్చనీయాంశంగా మారింది.   1999 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆతర్వాత 2004లో స్వల్ప ఓట్లతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి తెలంగాణ ఉద్యమం హోరులో అప్పటి టీఆరెస్ అభ్యర్థి అరవింద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2010లో జరిగిన ఎన్నికల్లో టికెట్ దక్కక పోవడంతో పార్టీ మారాలనే యోచనలో పడ్డారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, అప్పటి వరకు టీఆరెస్ లో ఉన్న అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో దివాకర్ రావు టీఆరెస్ లో చేరారు. ఆపార్టీ తరపున పోరి చేసి గెలుపొందారు. ఆతర్వాత 2018 ఎన్నికల్లో కూడా టీఆరెస్ తరపున పోరి చేసి గెలుపొందారు. 

  • రెండవసారి బాల్క సుమన్

చెన్నూర్ నుంచి బాల్క సుమన్ రెండవసారి ఎన్నికల బరిలో నిలువనున్నారు. పెద్దపల్లి ఎంపీ.గా పనిచేసిన సుమన్ 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న ఓదెలుకు మొండి చేయి చూపారు.వివాదాల నేపథ్యంలో చిన్నయ్య గట్టెక్కేనా తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి జాతీయ స్థాయి నుంచి బెల్లంపల్లి వరకు ఆందోళన చేసి చిన్నయ్య ఖ్యాతిని తగ్గించేందుకు ప్రయత్నం చేసింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా చిన్నయ్యకు టికెట్ రావడం విశేషం. ఎం.పి.పి, జడ్పిటీసీ గా తెలుగుదేశం లో రాజకీయ ఓనమాలు దిద్దిన చిన్నయ్య 2014 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి టీఆరెస్ నుంచిపోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో కాలు పెట్టారు. 2018 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ముచ్చటగా మూడవసారి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు.