ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేసెంత వరకు పోరాటం ఆగదు: బీఆర్ఎస్

ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేసెంత వరకు పోరాటం ఆగదు: బీఆర్ఎస్
  • ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తానన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చింది
  • కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో అడ్డగోలుగా 420 హామీలు
  • నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకుల ధర్నా
  • ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాటను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవాలి: నల్గొండ జడ్పీ చైర్మన్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు

ముద్ర ప్రతినిధి, నల్గొండ:ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని నల్గొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు మండిపడ్డారు. ఎల్అర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం ఆయా ప్రాంతాల స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ కేంద్రాలలో ధర్నా చేపట్టారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో రమావత్ రవీంద్ర కుమార్, మిర్యాలగూడ భాస్కరరావు, నాగార్జునసాగర్ నోముల భగత్, నకిరేకల్ చిరుమర్తి లింగయ్య ధర్నాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నాయకులు ఎల్ ఆర్ ఎస్ పై చెప్పిన మాటలు అన్ని ఉత్తముచ్చట్లేనని ఆరోపించారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే సామాన్య ప్రజలపై 20 వేల కోట్ల బాధలకు కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ పై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని, విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేల కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మ్యానిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారెంటీలను ఇచ్చారని, కానీ బీఆర్‌ఎస్‌ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ చేయాలని అయన డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడినరు అని ఆయన అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.