అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం
  • శివ నామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు ఆలయ పరిసర ప్రాంతం
  • పాల్గొన్న రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకను అర్చక బృందం వేద మంత్రాలతో శనివారం తెల్లవారు జామున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ వేడుకకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజల నిర్వహించారు.

తెల్లవారుజామున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం- పుష్ప దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వా వారికి సమర్పించారు. స్వామివారి కల్యాణం వేడుకను జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తిలకించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మోత్సవాల గుట్ట పై రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. చెరువుగట్టు పరిసర ప్రాంతంమంతా శివనామస్మరణంతో మార్మోగింది. కోరిన కోరికలు తీర్చే రామలింగేశ్వరుడికి భక్తులు తలంబ్రాలు సమర్పించుకున్నారు. శివశక్తులు తమ ఆట, పాటలతో భక్తులను మైమరిపించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.