పట్టపగలే చోరీ–బంగారం, వెండి, నగదు అపహరణ..

పట్టపగలే చోరీ–బంగారం, వెండి, నగదు అపహరణ..

ముద్ర,వీపనగండ్ల:-మండల కేంద్రమైన వీపనగండ్లలో పట్టపగలే ప్రధాన రోడ్డు ప్రక్కనే ఉండే ఇంట్లో దొంగలు పడి బంగారం వెండి నగదును అపహరించకపోయిన ఘటన ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు చోటుచేసుకుంది. బాధితులు కనమోని సత్యనారాయణ రాదమ్మ దంపతులు. సత్యనారాయణ గ్రామంలోని పెట్రోల్ బంక్ లో పని చేస్తుండగా రాదమ్మ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది. సత్యనారాయణ పెట్రోల్ బంకులో పని ముగించుకొని, భార్య రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఇంటికి వచ్చారు. ఉదయం 10 గంటలకు సమయంలో టిఫిన్ చేసిన పిల్లలకు కొత్త బట్టలు తేవడానికి పదిన్నర గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ద్విచక్ర వాహనంపై వనపర్తికి బయలుదేరినట్లు బాధితులు తెలిపారు. కొద్ది దూరం వెళ్లేసరికి ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయని దొంగలు పడినట్లు ఫోన్ రావడంతో వెన్ను తిరిగి రావటం జరిగిందని తెలిపారు. ఇంటికి వేసిన తాళం విరగొట్టి ఉందని, బీరు పగలగొట్టి 8 తులాల బంగారు గొలుసులు, 12 తులాల వెండి గొలుసులు, 56 వేల 500 నగదు ను తీసుకెళ్లినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నందికర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. వనపర్తి నుంచి వచ్చిన పోలీస్ క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టపగలే చోరి జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.