పాత వాటికే గతి లేదు కొత్త వాగ్దానాలా?

పాత వాటికే గతి లేదు కొత్త వాగ్దానాలా?
  • కుటుంబ పర్యటనలా సీఎం పర్యటన
  • అల్లోల అవినీతిపై విచారణ జరపాలి
  • మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ పర్యటన ఒక పద్ధతి లేకుండా కుటుంబ పర్యటనలా సాగిందని మాజీ ఎమ్మెల్యే బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలకే ఇప్పటికీ అతిగతి లేదని, పైగా కొత్త హామీలతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన బిజెపి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీలకు ఒక్కో దానికి రూ 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే గతంలో పూర్తి అయిన పనులకే ఇప్పటికీ బిల్లుల చెల్లింపు జరగలేదని ఆయన విమర్శించారు. ఇక మంత్రి ఐకే రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ వ్యవసాయ భూములను పారిశ్రామిక ప్రాంతాలుగా మారుస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటిస్తే ప్రతిపక్ష నేతలను ఆహ్వానించడం సర్వసాధారణమని, అయితే ఈ ముఖ్యమంత్రి హయాంలో అరెస్టులు సర్వసాధారణం అయ్యాయన్నారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల రూపాయలు ఇస్తామనడం కేవలం ఎన్నికల డ్రామాగా అభివర్ణించారు. ప్రతి తాలూకా కేంద్రంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని గత ఎన్నికల్లోను హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకు స్థల సేకరణ గాని, నిధుల మంజూరు గాని జరగలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తమ ధాన్యం కళ్లాల్లో  నెలల తరబడి కాపలా కాస్తున్నారన్నారు. సమాజంలో ఏ ఒక్క వర్గం కూడా పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయటం లేదని, ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అయ్యన్న గారి భూమయ్య, రావుల రామ్ నాథ్, అంజుకుమార్ రెడ్డి, అలివేలు మంగ, మెడిసెమ్మే రాజు, ఓడిసెల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.