ఇవి ప్రతీకార దాడులే...!

ఇవి ప్రతీకార దాడులే...!

ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి బి సి) కార్యాలయాలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు రోజులుగా  జరుపుతున్న దాడులు జర్నలిస్టు లోకాన్ని నివ్వెర పరిచాయి. ఆదాయం పన్ను చట్టం ఉల్లంఘనలు, పన్ను ఎగవేత ఆరోపణల సాకుతో జరుగుతున్న ఈ సోదాలు ప్రతీకార దాడులు తప్ప మరొకటి కాదని లోకం కోడై కూస్తోంది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితిని మించి పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఈ దాడులను ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రధాన పత్రికలు, ఎడిటర్లు, వర్కింగ్ జర్నలిస్టుల సంఘాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ సూచీలో ఇప్పటికే దాదాపు అట్టడుగున ఉన్న భారత్ స్థానాన్ని, దేశ ప్రతిష్టను ఈ దాడులు మరింత దిగజార్చాయి.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మీడియా పట్ల ఏ పాటి గౌరవం ఉందో ఈ సంఘటన అద్దం పడుతున్నది. అంతర్జాతీయ వేదికలపై మోడీ చేసుకుంటున్న ప్రచారానికి వాస్తవంగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు పొంతన ఉండటం లేదు. దేశంలోని పెద్దపెద్ద మీడియా సంస్థలను నయాన భయాన తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్న బిజెపి ప్రభుత్వం చిన్నపాటి విమర్శలను సైతం జీర్ణించుకోలేని పరిస్థితికి చేరుకుంది. స్వదేశంలో మీడియాకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలను కూడా వదలడం లేదు.

గుజరాత్ లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లలో ఆయన ప్రమేయం, ఆయన ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి గురించి బిబిసి విడుదల చేసిన డాక్యుమెంటరీ పర్యవసానమే ఈ దాడులు. దేశంలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను ప్రభుత్వం నిషేధించింది. ఈ చర్యపై ప్రతిపక్షాలు, విద్యార్థి, పౌర సంఘాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన వ్యక్తం చేశాయి. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి జరిగిన ప్రయత్నాలను కఠినంగా అణచివేసింది. పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వాతంత్ర్యాన్ని ఎంత మాత్రం గౌరవించకుండా, ఎడా పెడా ఉల్లంఘనలకు, అణచివేతకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వం కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జి-20 దేశాల అధ్యక్షుడిగా కొనసాగుతున్న మోడీ అంతర్జాతీయ వేదికలపై సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి వస్తుంది.