Kondagattu Theft Case: కొండగట్టు చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్...

Kondagattu Theft Case: కొండగట్టు చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్...
  • 5 కిలోల వెండి అభరణాలు స్వాధీనం..
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ ఎగ్గడి భాస్కర్...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వారం రోజుల క్రితం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 23 అర్ధరాత్రి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలోలోకి కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ముదోల్ కు చెందిన ఏడుగురు నిందితులు ఆలయంలోచోరికి పాల్పడి స్వామివారి వెండి విగ్రహం, మకర తోరణంతో పాటు రూ. 9 లక్షల విలువచేసే 15 కిలోల వెండి అభరణాలను ఎత్తుకెళ్ళారు.

ఈ సంఘటనలు పోలీసులు వద్ద ఉన్న డాగ్ స్క్వాడ్ డాగ్ రాంబో, క్లూస్ టీం సేకరించిన వేలిముద్రలు, నిందితుల వాడిన ఇతర రాష్ట్రాలకు చెందిన మొబైల్ నెంబర్లతో కొండగట్టు టవర్ ప్రాంతంలో వచ్చిపోయిన కాల్స్ ఆధారంగా 24 గంటల్లోనే పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులంతా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చెందిన వారిగా గుర్తించారు. నిందితులు 7గురు ఈ నెల 22న సాయంత్రం కొండగాట్టుకు వచ్చి భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకున్నారు . మరుసటి రోజు ఉదయం మరో మారు దర్శనం చేసుకుని ఆభరణాల అపహరణకు రెక్కి నిర్వహించారు. అదే రోజు అర్ధ రాత్రి ఆలయంలోకి చొరబడి ఆభరణాలు ఎతుకేల్లారు.

 ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి ప్రకాష్ అధ్వర్యంలో పది పోలీసు బృందాలను ఏర్పాటు చేసే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. గర్భగుడిలో నలుగురు చోరికి పాల్పడగా ముగ్గురు సహాయకులుగా పనిచేశారు. వీరిలో ఏ1 గా ఉన్న బాలాజీ కేశవ రాథోడ్, ఏ5గా ఉన్న నర్సింగ్ యాదవ్ ఎ 7గా ఉన్న విజయ్ కుమార్ రాథోడ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా అంతరాష్ట్ర దొంగల ముఠా కు చెందిన సభ్యులని  ఎస్పీ తెలిపారు. వీరిపై మహారాష్ట్రలోని పండరిపుర, మెదక్ జిల్లాలోని చాముండేశ్వరి, కమాన్పూర్  తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో జరిగిన చోరిల్లో వీరు నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు జగిత్యాల మండలం తాటిపల్లిలో ఓ ప్రాంతంలో వెండి ఆభరణాలను దాచి ఉంచారానే విశ్వాసనియా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అభరణాలను స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులనుంచి రూపాయలు 3.5 లక్షల విలువ చేసి వెండి శటగోపం, వెండి గొడుగు, వెండి పెద్ద రామరక్షలు, రెండు ద్వారము కవచ భాగాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. పరారీ లో ఉన్న మిగతా నలుగురు నిందితులు రామారావు జాదవ్, రామ్ శక్తి, విక్రం జాదవ్, దేవిదాసులకోసం మరో నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నాయని వారిని త్వరలోనే పట్టుకొని మిగతా సొమ్ము రికవరీ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దొంగతనం కేసు చేదించిన డిఎస్పి ప్రకాష్ తో పాటు మల్యాల, కోరుట్ల, సిసిఎస్, ఎఫ్.పి.యు, ఐటి కోర్ సిఐలు రమణమూర్తి, ప్రవీణ్ కుమార్, నాగేశ్వరరావు, డి. రాజు, సరిలాల్, మల్యాల,సిసిఎస్, ఆర్ఎస్ఐ లు చిరంజీవి, సుధాకర్, సుమన్, మల్లేష్ తోపాటు పోలీసులను డాగ్ స్క్వాడ్  రాంబోను ఎస్పీ అభినందించారు.