యుబిట్ కాయిన్ కేసులో మరో ముగ్గురు అరెస్టు ... దర్యాప్తులో మరో ముందడుగు

యుబిట్ కాయిన్ కేసులో మరో ముగ్గురు అరెస్టు ... దర్యాప్తులో మరో ముందడుగు
  • ప్రధాన సూత్రధారి బ్రిజ్ మోహన్ సింగ్
  • ఈ కేసులో అంతర్జాతీయ మూలాలు
  • 11 బ్యాంక్ ఖాతాల స్థంభన
  • ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన యు బిట్ కాయిన్ కేసులో మరింత పురోగతి సాధించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన ఐదుగురిని గతంలో అరెస్టు చేశామని,  మరో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేశామని ఆమె వివరించారు. ఈ ఉదంతం తో సంబంధం ఉన్న 11 బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేశామని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజలను మోసగించి పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయించిన నేపథ్యంలో గతంలోనే ఎక్సైజ్ ఎస్ ఐ, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ సహా ఐదుగురిని అరెస్టు చేసిన నేపథ్యంలో వారిచ్చిన సమాచారం మేరకు పలు విషయాలు వెల్లడయ్యాయన్నారు. బుధవారం అరెస్టు చేసిన వారిలో  కడెం మండలం కన్నాపూర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసరి రమేష్, బోథ్ మండలం సోనాల లో ఉపాధ్యాయుడు బొమ్మిడి ధనుంజయ్, నిర్మల్ దివ్య నగర్ కు చెందిన కిరం వెంకటేష్ ఉన్నారని వివరించారు. గతంలో అరెస్టయిన వారితో పాటు వీరు కూడా పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి మల్టి లెవెల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని విస్తరించారన్నారు.

విచారణలో కీలక కుట్రదారుని గుర్తింపు

ఈ పథకం వెనుక ప్రధాన కుట్రదారు బ్రిజ్ మోహన్ సింగ్ అని వెలుగులోకి వచ్చిందని, పలు రాష్ట్రాల్లో  పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేసి ఈ స్కామ్‌ను ముందుకు నడపడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించాడన్నారు. అతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయని దర్యాప్తు అధికారులు గుర్తించారని వివరించారు. అతని క్రిమినల్ నెట్‌వర్క్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరిట పెట్టుబడిదారులను మోసాగించటమే లక్ష్యమని పేర్కొన్నారు. 

బ్యాంకు ఖాతాల స్తంభన

కొనసాగుతున్న విచారణలో భాగంగా నిర్మల్ పోలీసులు మోసపూరిత పథకంతో ముడిపడి ఉన్న 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. కుంభకోణంలో పాల్గొన్న ఆర్థిక లావాదేవీలను పోలీసులు ట్రాక్ చేస్తూనే ఉందన్నారు. అదనపు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే ప్రక్రియ మరియు ఆస్తుల గుర్తింపు ప్రక్రియ  ప్రస్తుతం కొనసాగుతోందని వివరించారు. నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో,  బాధితుల సొమ్ముకు భద్రత కల్పించడంలో ఈ దశ తప్పనిసరి అని పేర్కొన్నారు.

కుట్రదారుల అంతర్జాతీయ సమావేశాలు

ఇటీవల అరెస్టయిన కొంతమంది వ్యక్తులతో సహా కీలక కుట్రదారులు గత ఎనిమిది నెలలుగా రహస్య సమావేశాలు నిర్వహించేందుకు నాలుగు వేర్వేరు దేశాలకు వెళ్లినట్లు విచారణలో తేలిందని వివరించారు.ఈ  పథకం పరిధిని విస్తరించి,  పెట్టుబడిదారులను మోసగించే నెట్ వర్క్ ను బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు జరిగాయని భావిస్తున్నట్లు తెలిపారు. కేసు అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉన్నందున వివిధ ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నట్లు వివరించారు.

బాధితులు ముందుకు రావాలి

క్రిప్టోకరెన్సీ పథకం ద్వారా బాధితులైన వ్యక్తులందరూ ముందుకు వచ్చి తమ స్టేట్‌మెంట్లను అందించాలని కోరారు. బాధితులు రికవరీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. పోలీసులు తమను సంప్రదించే వరకు వేచి ఉండకుండా, స్వచ్ఛందంగా చట్ట అమలును సంప్రదించడం బాధితులకు మంచిదని పోలీసు అధికారులు సూచించారు. బాధితులు, సంబంధిత వ్యక్తులు నేరుగా నిర్మల్ ఎస్పి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్సై లు లింబాద్రి,  దేవేందర్, ఎం. రవి, సాయి కృష్ణ, గౌస్ లను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.