పేదలకు సకాలంలో న్యాయం అందాలి

పేదలకు సకాలంలో న్యాయం అందాలి
  • పెండింగ్ కేసులను పరిష్కరించేందుకే అదనపు కోర్టులు మంజూరు
  • న్యాయవాదులు వృత్తికి వన్నెతేవాలి

ముద్ర ప్రతినిధి, కోదాడ: సమాజంలో పేదలకు కూడా సత్వర న్యాయం అందించేలా న్యాయ వ్యవస్థ పని చేయాలని తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కేసులు పెండింగ్ లో ఉంచకుండా సామాన్య మానవునికి సత్వరం న్యాయం జరిగేందుకు నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ లో నూతనంగా మంజూరైన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి  కోర్టులను శనివారం హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్  టి. వినోద్, జస్టిస్ కే. లక్ష్మణ్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ పుల్లా కార్తీక్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కోదాడ లో 25 కోట్లతో నిర్మించిన నూతన కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలతో న్యాయం కోసం కోర్టుకు వచ్చే మహిళలను పదేపదే కోర్టులకు తిప్పకుండా సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకే  అదనపు కోర్టులను మంజూరు చేస్తున్నామని చెప్పారు.

న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని న్యాయవ్యవస్థకు వన్నె తేవాలని అన్నారు . సీనియర్ న్యాయవాదులు , జూనియర్ న్యాయవాదులకు సలహాలు అందిస్తూ , సందేహాలు తీరుస్తూ వారిలో వృత్తి నైపుణ్యం పెంపొందించాలని, జూనియర్ లు సీనియర్ల వద్ద మెళకువలు నేర్చుకొని రాణించాలని సూచించారు. కోదాడ లో కోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా బార్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టతకు న్యాయవాదులు, న్యాయమూర్తులు కలిసి పని చేయాలన్నారు.  హైకోర్టు జడ్జిలు వినోద్ కుమార్ ,లక్ష్మణ్ , విజయసేన్ రెడ్డి ,పుల్లా కార్తీక్ లు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్య విలువలను అందించాలని సూచించారు. భవిష్యత్ తరాలు న్యాయవాద వృత్తిని స్వీకరించే విధంగా ఆదర్శంగా నిలవాలన్నారు. అదనపు కోర్టులు కేసుల సత్వర పరిష్కారానికి. దోహదపడతాయన్నారు నూతన భవన నిర్మాణాన్ని కోదాడ బార్ అసోసియేషన్ కాలయాపన చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కోదాడలో కోర్టుల భవన నిర్మాణాలు చారిత్రాత్మకంగా నిలవాలన్నారు .కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవబతిని నాగార్జున మాట్లాడుతూ కోదాడ కోర్టు భవన నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, న్యాయమూర్తులకు  కోదాడ బార్ అసోసియేషన్ తరపున   కృతజ్ఞతలు తెలిపారు.

కోదాడకు అదనపు కోర్టులు మంజూరు చేయడం తో కక్షిదారులు దూరప్రాంతాలకు వెళ్లకుండా కోదాడలోనే న్యాయం పొందే అవకాశం  కలిగిందన్నారు . కోదాడకు అడిషనల్ జిల్లా కోర్టును కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా నాలుగు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న సీనియర్ న్యాయవాదులు సుధాకర్ రెడ్డి,  రాధాకృష్ణమూర్తిలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. జిల్లా జడ్జి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో  జిల్లా కలెక్టర్ వెంకట్రావు ,ఎస్పీ రాహుల్ హెగ్డే హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లా నాగేశ్వరరావు , బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, కోదాడ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, ఆర్ డీ వో సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గాలి శ్రీనివాస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి  సాధు శరత్ బాబు, జాయింట్ సెక్రటరీ సీతారామరాజు, కోశాధికారి పాష, క్రీడా కార్యదర్శి పవన్, లైబ్రరీ కార్యదర్శి కరీం, కార్యవర్గ సభ్యులు దొడ్డ శ్రీధర్, చలం, నాగరాజు, హేమలత, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పలువురు సీనియర్ , జూనియర్ న్యాయవాదులు,  పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.