అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ...

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ...
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

ముద్ర, షాద్ నగర్:-అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు.  తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులకు సమస్యలు అనేకం ఉన్నాయని వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా, నిరసన వ్యక్తం చేసినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఈ ఎస్ ఐ, పిఎఫ్  అమలు చేసి గ్రాటిట్యూట్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్  అంగన్వాడి ఉపాధ్యాయులకు 10 లక్షలు, ఆయాలకు ఐదు లక్షలు , ప్రమాద బీమా 20 లక్షలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రతి అంగన్వాడికి 2 లక్షల రూపాయలు కేటాయించాలని, తమకు పని భారం కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను  మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని నిర్బంధం విదిస్తే పోరాటం మరింత ఎగిసిపడుతుందని వారు అన్నారు.