నేడు నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి

నేడు నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి

నార్ల వెంకటేశ్వరరావు పరిచయం అక్కర్లేని పేరు. నిర్భయానికి, నిక్కచ్చితనానికి, నిబద్ధతకు మారుపేరు. వృత్తిని నిబద్ధతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణను సామాజిక బాధ్యతగా భావించారు.  పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టులకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణలమయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ధి కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగారు. రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు. 


మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో 1 డిసెంబర్1908న జన్మించిన నార్ల విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది.  3 ఏప్రిల్ 1958 నుంచి 2 ఏప్రిల్1970 వరకు రెండు పర్యాయాలు  రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర పత్రికలో విధులు నిర్వహించారు. ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. విధి నిర్వహణలో ఆయన ఎన్నడూ రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత కలగలిపి ఉండేవి. పండితునికి, పామరునికి తెలుగు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు రాశారు. రచనలు చేశారు. 'వాస్తవమ్ము నార్లవారి మాట' మకుటంతో ఆటవెలదులు రచించారు. 'నవయుగాల బాట నార్ల మాట’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటిని వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవంటే మాటలు కాదు.

అసమాన ప్రతిభాశాలి
సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు.  ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడేవారు. ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి,  కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జీ. రంగా లాంటివారిని ఎవరినీ ఆయన వదల  లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఛాందసాన్ని విమర్శించక మానలేదు. ఇందిరాగాంధీ, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాలను ద్వేషించారు. ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాలలోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది.  గోరాశాస్త్రి మాటలలో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవారు' నార్ల. ‘యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు.


సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి. బడు వాడేవాడు బడుద్ధాయి’ అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 16 ఫిబ్రవరి 1985న ఈ లోకాన్ని వీడిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు. ‘ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు, వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా'  ‘నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా’ అంటూ విలువలు వీడవలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో  ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు  నిజంగానే శిరోధార్యం.