ప్రజా రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్థాం
- అన్ని వర్గాలకు మేలు జరిగేలా ప్రజా పాలన
- పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ప్రజా రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం పానుగల్ మండల కేంద్రంలోనీ రైతువేదిక లో డిసిసిబి చైర్మన్ మామిళ్ళ పల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సింగిల్ విండో మహాజన సభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యడం జరిగిందన్నారు. కొంత మంది రైతులకు సాంకేతిక కారణాల వలన రుణమాఫీ కాలేదని త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యడం జరుగుతుందన్నారు. డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, తనకు డిసిసిబి చైర్మన్ పదవి రావడానికి సహకరించిన సిఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి జూపల్లి కి, జిల్లా ఎమ్మెల్యే లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యాటక శాఖ తెలంగాణ దర్శిని ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను మంత్రి జూపల్లి విద్యార్థులకు పంపిణీ చేశారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు ఉండాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరీలు, వార్త పత్రికలు ఉండాలన్నారు. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవింద రాజులు, తహశీల్దార్ సుభాష్ నాయుడు, ఎంపిడిఓ గోవింద రావు, ఎంఈఓ శ్రీనివాసులు, విండో వైస్ చైర్మన్ బాలయ్య,మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు,మాజీ జడ్పీటీసీ రవి కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధు సుధన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ సాగర్, రాము యాదవ్,పుల్లా రావు, సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.