నింగికేగిన నాద శరీరం

నింగికేగిన నాద శరీరం

భారతీయ వెండితెరపై శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి అణిముత్యాలను అందించిన కే విశ్వనాథ్ ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా కోసమే తపిస్తూ బతికారనేది గమనార్హం.

టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న..

టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. 50కి పైగా సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం.

ఫిబ్రవరి 2వ తేదీ తనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన శంకరాభరణం రిలీజ్ కావడంతో ఆయన రోజంతా ఉత్సాహంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణించే చివరి క్షణం వరకు పాటను రాస్తూ ఉన్నారు. ఆయన రాయలేని పరిస్థితుల్లో తన పెద్ద కుమారుడికి తన నోటి మాటలతో చెబుతూ పాటను రాయించారు. తన కుమారుడు రాసిన పాటను వింటూ అలాగే వాలిపోయారు. తాను రాసిన.. తన కుమారుడితో రాయించిన పాట వింటూ తుదిశ్వాస విడిచారు అని అన్నారు.

రోజంతా కష్టపడి స్వయంగా ఓ పాటను రాసే ప్రయత్నం చేశారు. అయితే తనకు సాధ్యపడకపోవడంతో కుమారుడిని పిలిచి తను చెబుతూ రాయించారు. అలా రాసిన పాటను వింటూనే వాలిపోవడంతో.. కంగారుపడిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని వైద్యులు ధృవీకరించారు. దాంతో ఆయన పార్ధీవదేహాన్ని తన నివాసానికి తీసుకొచ్చారు.

దర్శకుడిగా ‘ఆత్మగౌరవం’ అనే సినిమాతో 1965లో విశ్వనాథ్ అరంగేట్రం చేశారు. సాగరసంగమం, శంకరాభరణం , స్వర్ణ కమలం, శుభసంకల్పం సినిమాలు విశ్వనాథ్ సినీ జీవితంలో మరపురాని చిత్రాలుగా నిలిచాయి. ‘శంకరాభరణం’ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తయిన రోజునే విశ్వనాథ్ శివైక్యం కావడం గమనార్హం. గుంటూరు జిల్లా రేపల్లెలో 1930, ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మించారు.

కళా తపస్వి కె.విశ్వనాథ్ గురించి మరిన్ని విశేషాలు:

* దాదాసాహెబ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ కె విశ్వనాథ్

* చెన్నైలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినిమా జీవితం ప్రారంభం

* శంకరాభరణం చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి

* అన్నపూర్ణ సంస్థ వారి తోడికోడళ్ళు చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభం

* అన్నపూర్ణ బ్యానర్‌పై వచ్చిన ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకులు

* అక్కినేని హీరోగా వచ్చిన ఆత్మ గౌరవం చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌కి శ్రీకారం

* సిరిసిరిమువ్వ చిత్రంతో విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు గుర్తింపు

* శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం తదితర సినిమాల్లో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలకు పెద్దపీట

* 1965లో ఆత్మగౌరవం సినిమాకు తొలి నంది అవార్డు

* 1992లో విశ్వనాథ్‌కు పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య పురస్కారాలు

* 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవం

* 5 నంది అవార్డులు, 5 జాతీయ అవార్డులు, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విశ్వనాథ్

* బాలీవుడ్‌లో 9 చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్

* తెలుగు, తమిళ భాషల్లో కలిపి 30కి పైగా చిత్రాల్లో నటించిన కళా తపస్వి

* పలు చిత్రాల్లో ప్రముఖ హీరోహీరోయిన్లకు అన్నగా, తండ్రిగా, తాతయ్యగా నటించి ప్రశంసలందుకున్నారు.