విత్తన విక్రయ దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకాలు చేసినట్లయితే కఠిన చర్యలు

విత్తన విక్రయ దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకాలు చేసినట్లయితే కఠిన చర్యలు
  • పత్తి విత్తనాలు బ్లాక్ లో రసీదు లేకుండా అమ్మకం చేసిన దుకాణాలను సీజ్ చేస్తాం
  • కాలం చెల్లిన పురుగు మందులు దుకాణాల్లో ఉండరాదు
  • నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే దుకాణదారులు రైతులకు అందించాలి
  • తుంగతుర్తి సీఐ శ్రీనివాస్

తుంగతుర్తి ముద్ర:-నకిలీ పత్తి విత్తనాలు అమ్మకం అలాగే రైతులు కోరిన పత్తి విత్తనాలను బ్లాక్ లో రసీదు లేకుండా అధిక ధరలకు అమ్మకం చేయడం చట్టరీత్యా నేరమని అలా ఎవరైనా విత్తన వ్యాపారులు ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తుంగతుర్తి సీఐ శ్రీనివాస్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు విత్తన విక్రయ దుకాణాలను స్థానిక ఏవో బాలకృష్ణ ,ఎస్సై ఏడుకొండలు తో కలిసి తనిఖీ నిర్వహించిన అనంతరం సిఐ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాల విక్రయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందులో భాగంగా ప్రతి విత్తన దుకాణదారు నాణ్యమైన విత్తనాలను రైతులకు అమ్మకం చేసి కచ్చితంగా రసీదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

దుకాణాల్లో అమ్మకం చేస్తున్న పత్తి విత్తనాల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులకు తెలియపరచాలని దుకాణంలో ఉన్న విత్తన రకాలను అధికారులకు తెలవకుండా అమ్మిన పక్షంలో వారి దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు .కష్టించి పంట పండించే రైతన్నకు విత్తన వ్యాపారులు మంచి విత్తనాలు అమ్మకం చేసి అండగా నిలవాలని అన్నారు. పురుగుమందుల విషయంలోకాలం చెల్లిన పురుగుమందులు దుకాణాల్లో ఉంటే తక్షణమే తొలగించాలని ఒకవేళ తమ తనిఖీల్లో ఎక్కడైనా కాలం చెల్లిన పురుగుమందులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి పట్టణంలోని పలు పత్తి విక్రయ కేంద్రాల్లో రికార్డులను అలాగే వారు అమ్మకం చేస్తున్న విత్తన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు .ఈ కార్యక్రమంలో పోలీసు ,వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.