కేశవాపురం వెలుగు పల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి
- వర్షాల వల్ల వచ్చే వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- నిండుకుండల్లా ఉన్న చెరువుల స్థితిగతులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి
- వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి ముద్ర:- గడచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగతుర్తి నియోజకవర్గం లోని పలుకుంటలు తెగిపోయాయని కొన్ని గ్రామాలకు వరదల కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయని మానాయకుంట వద్ద ఒక మహిళ వరదల కొట్టుకపోయి మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కేశవాపురం బంధాన్ని పరిశీలించి మాట్లాడారు.
కేశవాపురం గ్రామానికి ఇతర గ్రామాలతో రాకపోకలు బంద్ అయ్యాయని సుమారు 1500 మంది ఆ గ్రామంలో చిక్కుకుపోయారని అన్నారు. ఆ గ్రామస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెలుగుపల్లి నుండి కేశవాపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డిలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. తాను గతంలోనే ప్రతిపాదనలు సైతం పంపానని వాటిని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే కేశవాపురం గ్రామానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయని అన్నారు. అదేవిధంగాఅరవపెళ్లి గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలలను చెరువులో నిర్మించడం వల్ల పాఠశాలలోకి నీరు వచ్చి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
మానాయకుంట వరదల ఒక మహిళ కొట్టుకుపోయి మృతి చెందిందని ఇది విచారకరమని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజలు కురుస్తున్న వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రమాద భరితమైన చెరువులను కుంటలను గమనించి లోతట్టు ప్రాంతంలో గ్రామాలు ఉన్న గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని సూచించారు. ప్రజలు భారీ ప్రవాహాల గుండా ప్రయాణించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కంట్లమయ్య ,పిసిసి మెంబర్ గుడిపాటి నరసయ్య ,మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.