యూఎస్7067 రకం పత్తి విత్తనం బ్లాక్ లో అమ్మకం?

యూఎస్7067 రకం పత్తి విత్తనం బ్లాక్ లో అమ్మకం?
  • వాస్తవమా?కాదా ? తేల్చాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు
  • నాణ్యమైన వరి విత్తనాలు రైతులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలి
  • గత సంవత్సరం కొంతమేర మొలకెత్తని వరి విత్తనాలు
  • రోహిణి కార్తి ఆరంభంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతన్నలు
  • వరి నార్లు పత్తి విత్తనాలు విత్తనానికి సిద్ధమవుతున్న రైతన్నలు
  • రోహిణిలో రోళ్లు పగిలే ఎండలు కొడతాయా? లేదా రోలు నిండే వానలు కురుస్తాయా?
  • రోహిణిలో వర్షాలు కురుస్తాయని చెబుతున్న పంచాంగకర్తలు


తుంగతుర్తి ముద్ర:- రోహిణి కార్తి ఆరంభంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని రైతుల అభిప్రాయం. ఈ సంవత్సరం రోహిణి కార్తె శనివారంతో ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. రోహిణి కార్తిలో వరినారులు పోసిన పత్తి ఇతరత్రా  విత్తనాలు వేసిన ఏపుగా పెరిగి దిగుబడి బాగా వస్తాయని రైతుల నమ్మకం. అనాదిగా రోహిణి కార్తిలో కొడితే బాగా రోళ్ళు పగిలే ఎండలు లేదా రోలు నిండే వానలు కురుస్తాయని ప్రజల అభిప్రాయం. వేసవికాలంలో ముగింపు కార్తె రోహిణి. అందుకే ఈ కార్తిలో కొడితే ఎండలు లేదా వానలు. ఈ ఏడాది మరి ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి.

ఈ 15 రోజులు కూడా ఎండలు కొడితే భరించడం కష్టమే. సాంప్రదాయం ప్రకారం పంచాంగ కర్తలు చెబుతున్న వివరాల్లోకి వెళితే రోహిణి కార్తె లో సంపూర్ణంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నుకున్న రైతులు పత్తి విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు.   యూఎస్ 7067రకం పత్తి విత్తనాలు బ్లాక్ లో అమ్ముతున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ విత్తనాలు దుకాణాల్లోకి వచ్చిన అయిపోయాయని చెప్పడం లేక ఇంకా రాలేదని చెప్పడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా విత్తనాలన్నీ లభ్యం కావడం ఏమిటి? ఈ రకం విత్తనాలు మాత్రమే దుకాణాల్లో దొరకకపోవడం ఏమిటి ? అని రైతులు ప్రశ్నిస్తున్నారు వరి విత్తనాల విషయానికి వస్తే ఇప్పటికే దుకాణదారులు వరి విత్తనాలు తమ తమ గోదాముల్లో నిలువ ఉంచినట్లు సమాచారం. ముందస్తుగా వ్యవసాయ శాఖ అధికారులు ఏ ఏ మండలానికి ఏ రకం విత్తనాలు దుకాణాల్లో వచ్చాయో రైతులకు తెలపాల్సి ఉంది. అటు వరి విత్తనాలు ఇటు పత్తి విత్తనాలు వాటి రకాలు ధరలతో సహా రైతుల ముందు ఉంచాల్సి ఉంది.ఏ రైతుకు ఏ రకం విత్తనాలు అవసరమో వాటిని కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పటివరకు విత్తన విక్రయ దుకాణదారుల వద్దకు ఏ విత్తనాలు వచ్చాయో ఇంతవరకు తెలియ రాలేదు.

దుకాణాల్లోకి విత్తనాలు వచ్చాయా లేదా బహిర్గతం కాలేదు .కొంతమంది తెచ్చిన తాము తేలేదు అన్నట్లు మరి కొంతమంది తాము తెచ్చిన ఎక్కువ అమ్ముడుపోయే రకం తమ వద్ద లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది .ఏది ఏమైనా ఖరీఫ్ సీజన్ ప్రారంభం ముందే రైతులకు విత్తనాల విషయంలో దుకాణదారులు చుక్కలు చూపుతున్నట్లు తెలుస్తోంది .గత ఏడాది వరి విత్తనాల్లో కొన్ని రకాలు   సరిగా మొలకెత్త లేదు రైతులు నానా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మరి ఈ ఏడాది వరి విత్తనాలు రైతులకు ఏ మేరకు మేలు చేస్తాయో వేచి చూడాల్సిందే. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు కోరుతున్న పత్తి విత్తనాలు దుకాణంలో సక్రమంగా అమ్మకం చేసే విధంగా చూడాలని దుకాణదారులు తెస్తున్న వరి విత్తనాలు నాణ్యమైన కావా పరిశీలించాలని యావత్ రైతాంగం కోరుతోంది.