అను 'మతి'లేని వెంచర్లు..!

అను 'మతి'లేని  వెంచర్లు..!
  • పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ లే అవుట్లు 
  • చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..

మెట్‌పల్లి ముద్ర: మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో పట్టణ జనాభా విస్తరిస్తున్న నేపథ్యంలో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి ప్రభుత్వనికి పన్నులు చెల్లించకుండా భూ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ప్లాట్ల అమ్మకాలను కొనసాగిస్తున్నారు రియల్టర్లు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. దీనిని అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పట్టణ శివారులోని వ్యవసాయ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడడంతో కొనుగోలుదారులకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందమైన బ్రోచర్లను తయారుచేసి లక్కీడ్రా రూపంలో కొనుగోలు చేయవచ్చు అంటూ ఆశలు రేపుతున్నారు.నిబంధనలను ఖాతరు చేయకుండా వ్యవసాయ భూముల్లో ప్లాటింగ్ చేసి డిటిసిపి అనుమతితో వెంచర్ వేశామని చెబుతూ కొనుగోలుదారులకు నమ్మబలుకుతున్నారు అక్రమ లే అవుట్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్న ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర్ అవుతున్నాయి.

వ్యవసాయ భూముల్లో అక్రమ లే అవుట్లు...

పట్టణంలో విలీనమైన గ్రామాలతో పాటు పట్టణంలోని వెల్లుల్ల రోడ్, అభయహస్త హనుమాన్, సాయికృష్ణ థియేటర్ వెనుక హనుమాన్ నగర్, వెంపేట్ రోడ్, సింగపూర్ రోడ్, తొమ్మిదవ వార్డు కాలువ వద్ద వ్యవసాయ భూములను చదును చేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లే అవుట్ లతో వెంచర్ లు ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మిదవ వార్డులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ ఏర్పాటు చేస్తే మున్సిపల్ అధికారులు హద్దురాళ్ళను తొలగించడంతో మళ్లీ ఆ వ్యాపారి అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అక్రమ లే అవుట్ ఫ్లాట్లు ఏర్పాటు చేస్తే చర్యలు.. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్

పట్టణంలో అక్రమ లే అవుట్లతో ఫ్లాట్లు ఏర్పాటు చేసి వెంచర్లు వేస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం, ప్రజలు ఫ్లాట్లు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్రమ లే అవుట్ ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ లే అవుట్ ఫ్లాట్ల కు రిజిస్ట్రేషన్ కాకుండా చూడాలి.