ఇది ఎన్నికల బడ్జెట్...!

ఇది ఎన్నికల బడ్జెట్...!
Union Finance Minister Nirmala Sitharaman to presents election budget

దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్ద పీటవేసే బడ్జెట్‌నే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి అందిస్తారని ఆశించిన వారికి ఈ బడ్జెట్‌ నిరాశనే మిగిల్చింది. తరుముకు వస్తున్న ఎన్నికల అవసరాలే చివరికి పైచేయి సాధించాయి. వివిధ రాష్ట్రాలలో రానున్న ఏడాది కాలంలో జరగబోయే  ఎన్నికలు   మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలకు కొన్ని వరాలు తెచ్చిపెట్టాయి.గత మూడు సంవత్సరాలుగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచాలని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలకు నిర్మలమ్మ దయ తలచింది. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి 7లక్షల రూపాయలకు పెంచడం ద్వారా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.  ఈ ఒక్కతాయిలంతో మిగిలిన అంశాల నుంచి మధ్యతరగతి దృష్టిని మరల్చవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావించింది.  ప్రభుత్వ రాబడిలో 34 శాతం మొత్తానికి అప్పులపై ఆధారపడవలసి ఉంటుందని, వడ్డీ చెల్లింపులకే 20 శాతం మొత్తం పోతుందని బడ్జెట్‌ స్వరూపం వెల్లడిస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఎంచుకుంటున్న మార్గాల గురించి కానీ,  ద్రవ్యోల్బణ కట్టడికి తీముకునే చర్య గురించి కానీ ఆర్థికమంత్రి వివరించలేదు. 

ఇంధన భద్రతకు 35 వేల కోట్లు ,పి.ఎం . ఆవాస్‌ యోజనకు 79 వేల కోట్ల రూపాయలు, వంద కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 75 వేల కోట్ల రూపాయలు సమకూర్చడం, ఈ-కోర్టులకు 7 వేల కోట్ల రూపాయలు వంటి నిర్ణయాలు ఘనంగానే  ఉన్నాయి. బడ్జెట్‌ అంచనాలు వాస్తవ రూపం దాల్చి నిధులు ఏమేరకు విడుదలై ఆయా రంగాల నిర్దేశిత కార్యక్రమాలకు ఖర్చవుతాయన్నది  వేచి చూడవలసిందే. వివిధ విభాగాలకు కేటాయించిన నిధులు సకాలంలో సద్వినియోగం కాని స్థితిగతులను కాగ్‌ ఎప్పటికప్పుడు ఏకరువుపెడుతుండడం చూస్తూనే ఉన్నాం. బడ్జెట్‌ అంచనాలు ఘనంగా ఉన్నా వాస్తవంగా నిధుల విడుదలే మనకు పెద్ద సమస్య. కోవిడ్‌ మహమ్మారి దెబ్బతో వైద్య, ఆరోగ్య రంగంలో దశాబ్దాలకాలంగా పాలకుల నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలోనూ వైద్య, ఆరోగ్యానికి సంబంధించి పటిష్టమైన ప్రణాళికేదీ ఈ బడ్జెట్‌ లో కనిపించలేదు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధనశాలల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉంది.  ఈ రంగంపై ప్రధానదృష్టికి బదులు 157 కొత్త నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుతో సరిపెట్టుకున్నారు.

సమ్మిళిత అభివృద్ధికి సప్తర్షి పేరుతో ఏడు ప్రాధాన్యతా అంశాలకు పెద్దపీట వేస్తామనడం , ఆత్మనిర్భర్‌ క్లీన్‌ప్లాంట్‌ కార్యక్రమానికి రెండువేల 200 కోట్లు కేటాయిస్తామనడం,పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో  500 వేస్ట్‌ టు వెల్త్‌ ప్లాంటుల ఏర్పాటు, రాగల మూడు సంవత్సరాలలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద లక్షలాది మంది యువతకు నైపుణ్యశిక్షణ, 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్ల ఏర్పాటు, పదిలక్షల కోట్ల రూపాయల కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు వీలు కల్పించడం, ఈ- కోర్టుల ప్రాజెక్టుకు 7 వేల కోట్లు ప్రతిపాదించడం వంటివి సానుకూల అంశాలు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్దగా కేటాయింపులు జరుగలేదు. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయగా, తెలంగాణ ప్రభుత్వం, బీజీపీ మినహా ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఏ బడ్జెట్‌ లో అయినా రాబడి, ఖర్చుల అంచనాలు మాత్రమే ఉంటాయి. ఆ తరువాత సవరించిన అంచనాలూ సరేసరి, వాస్తవ నిధుల విడుదల, వాటిని నిర్దేశిత లక్ష్యాలకు ఆయా విభాగాలు సద్వినియోగం చేయడంలోనే బడ్జెట్‌  ఏమేరకు లక్ష్యాన్ని సాధించిందన్నది తేలుతుంది. లేకుంటే ఇది అంకెల గారడీగా మిగిలిపోతుంది.