తెలంగాణలో కమీషన్ల పాలన

తెలంగాణలో కమీషన్ల పాలన
  • రాష్ట్రాన్ని లూటీ చేస్తోన్న కాంగ్రెస్ నేతలు
  • 6 గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు
  • తెలంగాణ పైసలన్నీ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారు
  • కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ‘కమీషన్ల’ పాలన కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రతి పనిలోనూ, కాంట్రాక్టుల్లోనూ 15 శాతం కమీషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. అయినప్పటికీ అన్ని హామీలు అమలు చేస్తున్నట్లుగా మహారాష్ర్ట  ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తూ మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇవ్వలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించినప్పటికీ, తెలంగాణలో రుణమాఫీ అమలు చేసినట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సొమ్మును ఖర్చు చేస్తూ తెలంగాణను మరింత దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అమలు చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ మైనారిటీ రిజర్వేషన్ల అమలు పేరుతో మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బుధవారం నాడు నాగపూర్ లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల  శంకర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ బిందాల్, కర్నాటక బీజేపీ ప్రతిపక్ష నేత నారాయణ స్వామిలతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ నాగపూర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పడం అవాస్తవమని అన్నారు.  తెలంగాణ సొమ్మును వెచ్చించి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.

అయితే   ఆ యాడ్స్ లో ఆరు గ్యారంటీల ఊసే లేదని,  తప్పుడు హామీలతో ఇక్కడ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. మ్యానిఫెస్టోలో పొందుపర్చిన 420 హామీల్లో కూడా ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తొలుత హిమాచల్ ప్రదేశ్‌లో 10 గ్యారంటీలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.  కర్ణాటకలో పాంచ్ న్యాయ్ పేరుతో, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా మోసం చేశారని ఆయన విమర్శించారు. హర్యానాలోనూ ఇట్లాంటి హామీలతో అధికారంలోకి రావాలని భావిస్తే, అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను తిప్పి కొట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలోనూ మహిళలకు రూ.3 వేలు, నిరుద్యోగ యువతకు రూ.4 వేలు ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.   కుల గణన వాగ్దానం చేస్తూ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కుల జనగణన పేరుతో  ఆస్తిపాస్తుల వివరాలు సేకరించాలని చూస్తంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. . కుల గణన సంగతి తరువాత ముందుగా 6 గ్యారంటీలను అమలు చేయాలని ఆయన  డిమాండ్ చేశారు.