రైతులను మినహాయించి కరెంటు మీటర్లు 

రైతులను మినహాయించి కరెంటు మీటర్లు 
  • బీఆర్ఎస్ మా మీద దుష్ప్రచారం చేస్తోంది
  • వ్యవసాయానికి మీటర్లని నేనెప్పుడూ చెప్పలేదు 
  • కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: రైతులను మినహాయించి ప్రతిచోట కరెంటు మీటర్లు పెడతామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తానెప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదన్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తే తాము కూడా సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విషయంలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణ ఆలోచనే లేదన్నారు. రుణాలు చెల్లించే సామర్థ్యం ఆధారంగానే సంస్థలకు కొత్త రుణాలు ఇస్తారన్నారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. పంపిణీ లీకేజీలు మొదలుకుని బిల్లుల వసూలు వరకు ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగానే నష్టాలు వస్తున్నాయన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో భారతీయ కర్బన్ మార్కెట్ అభివృద్ధిపై జరిగిన వర్క్ షాప్ లో ఆర్కే సింగ్ మాట్లాడారు. తొమ్మిదేళ్ళలో దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం కరెంట్ సదుపాయం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ సర్కార్ కే దక్కుతుందన్నారు. సుమారు 2.9 కోట్ల ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. 2030 నాటికి మన వినియోగంలో 40 శాతం శిలాజేతర ఇంధనాలు ఉండాలని అంతర్జాతీయ వేదికల ద్వారా నిర్ణయం జరిగిందన్నారు. తాము తొమ్మిదేళ్ల ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. 

రూ. 1 లక్ష 57 వేల కోట్లు మంజూరు

ఆర్ఈసీలో తెలంగాణకు రూ. 1 లక్ష 57 వేల కోట్లు మంజూరు చేసామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 19,700 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్రానికి అందజేశామన్నారు. పీఎఫ్ సీ ద్వారా లక్షా ఎనిమిది వేల కోట్లు మంజూరైతే.. 91 వేల కోట్లు విడుదల చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధులలో సింహభాగం ఇప్పటికే విడుదల చేశామన్నారు. కాళేశ్వరం, యాదాద్రి, సీతారామ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వద్ద రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమైన స్థోమత లేని కారణంగా ఆ రుణాలను నిలిపివేశారన్నారు.