గ్రంథాలయాల సేవలను వినియోగించుకోవాలి

గ్రంథాలయాల సేవలను వినియోగించుకోవాలి
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  • మంచాలలో శాఖా గ్రంథాలయం ప్రారంభం

ఇబ్రహీంపట్నం, ముద్ర: గ్రంథాలయాల సేవలను విద్యార్థులు, నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంచాల మండల కేంద్రంలో రూ. 56 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ జాటోత్ నర్మద, జెడ్పిటిసి మర్రి నిత్య రెడ్డి, మార్కెట్ ఛైర్మెన్ ఏర్పుల చంద్రయ్యలతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ యువత, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. విజ్ఞానానికి, విరామకాల సద్వినియోగానికి, విశేష జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు మానవజీవితంలో విడరాని సంబంధం కలిగి ఉంటున్నాయి. ఆధునిక యుగంలో సౌకర్యాలెన్ని పెరిగినా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలే ప్రధాన ఆధారంగా ఉంటున్నాయని చెప్పారు. వివిధ రకాల పోటీ పరీక్షలైన పబ్లిక్ సర్వీసు కమిషన్, సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు, ఎన్‌డిఎ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన పుస్తకాలతోపాటు సాహిత్యం, సంస్కృతం, నవలలు, భక్తి, విద్య, ఆరోగ్యం, చరిత్ర తదితర రకాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఇంటర్, డిగ్రీ పుస్తకాలు, ప్రతీరోజు వచ్చే వివిధ దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలు, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలు కూడా గ్రంధాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రంథాలయాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, బుస్సు పుల్లారెడ్డి, సర్పంచ్ అనిరెడ్డి జగన్ రెడ్డి, ఎంపిటిసి ఎడమ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మనోజ్ కుమార్, గ్రంథపాలకులు యాదయ్య, సత్యనారాయణ, శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్లు పావని, జానీపాషా తదితరులు పాల్గొన్నారు.